Begin typing your search above and press return to search.

కమలం...కీలకం... తులసీదళం ...?

By:  Tupaki Desk   |   10 May 2022 12:30 AM GMT
కమలం...కీలకం... తులసీదళం ...?
X
ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఏంటి అంటే ఏమీ లేదు అని అంతా చెబుతారు. పొలిటికల్ గా బాగా లైట్ తీసుకుంటారు. నిజానికి ఒక వైపు నుంచి చూస్తే అదే వాస్తవం కూడా. అయితే ఓట్ల లెక్కలు, బూత్ లలో ఓటర్ల బలాలు, వివరాలు, నాయకులు ఎంతమంది ఏపీ బీజేపీకి ఉన్నారు. ఇలాంటి లెక్కలలను బట్టి చూస్తే ఏపీ బీజేపీ వెరీ వీక్. కానీ బీజేపీ మామూలు పార్టీ కాదు, కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పటికి రెండు సార్లు అక్కడ పగ్గాలు అందుకుని పటిష్టంగా ఉంది.

అంతే కాదు మూడవ విడత అధికారంలోకి వచ్చే ఎక్కువ అవకాశం ఉన్న పార్టీ కూడా బీజేపీయే. ఇక బీజేపీలో మోడీ బలమైన నాయకుడు. చాలా మంది నేతల కంటే భిన్నమైన నేతగా ఉంటారు. ఆయనతో ప్రేమగా ఉంటే ఒకే. కానీ వైరం తెచ్చుకుంటే మాత్రం ఇంతే సంగతులు. అది 2019 ఎన్నికల వేళ టీడీపీ గట్టిగా చవిచూసింది.

ఎన్నికల వేళ సర్వ వ్యవస్థలు ఎన్నికల సంఘం కంట్రోల్ లో ఉన్న కేంద్రంలో ఉన్న పార్టీని కూడా ఏమీ తక్కువగా తీసివేయలేరు. ఎన్నికల్లో ధన ప్రవాహాం ఏరులై పారుతుంది అన్నది వాస్తవం. తమకు గిట్టని పార్టీ మీద ఇన్ కమ్ టాక్స్ దాడులు, ఈడీ దాడులు రాత్రికి రాత్రి చేయించే సామర్ధ్యం కూడా కేంద్ర పార్టీలకు ఎపుడూ ఉంటుంది.

అలా ప్రత్యర్ధి పార్టీల బలాన్ని ఏమీ లేకుండా చేసి చేతులు కట్టేస్తే చాలు ఎన్ని పొత్తులు ఉన్నా ఎంతలా జనాదరణ ఉన్నా ఇబ్బందులు తప్పవు. ఇది అక్షరాలా అనుభవంలో చూసిన టీడీపీ అందుకే బీజేపీని శరణు కోరుతోంది. అందుకే ఆ పార్టీ జనసేన వైపు నుంచి బీజేపీని కలుపుకుని పోవాలని చూస్తోంది. ఇక బీజేపీతో పవన్ స్నేహం వెనక కూడా చాలా విషయం ఉంది. పొత్తులు ఉంటే కేంద్ర నాయకత్వం నుంచి మెండుగా నిండుగా అన్ని రకాలైన సాయం లభిస్తుంది. అలా కాక విడిగా పోటీ చేస్తే పలు రకాల ఇబ్బందులు జనసేనకూ ఉంటాయి.

అందుకే టీడీపీతో ఇప్పటికిపుడు పొత్తు అని అనౌన్స్ చేయాలని ఉన్నా బీజేపీని కూడా కలుపుకునిపోవాలన్న ఆశతోనే పవన్ ఆగుతున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఎన్నికల పర్వం ముగిశాక ఏర్పడే ఏ ప్రభుత్వానికి అయినా కేంద్ర సాయం తప్పనిసరి. ఏపీలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కేంద్రం ఆదుకోకపోతే క్షణం కూడా బండి నడిచేట్టు లేని దుస్థితి.

ఇంకో విషయం చెప్పాలీ అంటే ఏపీలో ఏ పార్టీ ఎన్నికల తాయిలాలు ప్రకటించినా అవి ఎంతో కొంత నెరవేరాలీ అంటే తప్పనిసరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ హెల్ప్ అవసరం. అందుకే వైసీపీ తెలివిగానే బీజేపీ కేంద్ర పెద్దలతో స్నేహం చేస్తోంది. పొత్తు పెట్టుకుంటే జనసేన టీడీపీలను పెట్టుకోనీయండి. బీజేపీ మాత్రం ఆ జట్టులో చేరకూడదు అన్నదే వైసీపీ పంతం. ఆ విధంగా చేయడం ద్వారా ఎన్నికల వేళ ఈ పొత్తు ఫలితాలు రాకుండా ముప్పతిప్పలు పెట్టే ప్లాన్ కూడా వైసీపీ వద్ద ఉంది అంటున్నారు. మొత్తానికి బీజేపీ ఎవరో చెప్పారని పొత్తులు కట్టదు, అలాగే ఏ పార్టీని కూడా దూరం పెట్టదు.

ఈ రోజు వరకూ చూస్తే ఏపీలో వైసీపీకి రాజకీయంగా బలం ఉంది. మరో రెండేళ్ళలో జరిగే ఎన్నికలలో చూస్తే ఆ బలం ఏ రూపానైనా తగ్గినా వైసీపీ మీద జనంలో వ్యతిరేకత బాగా పెరిగిగా కూడా కచ్చితంగా బీజేపీ కేలక నిర్ణయం తీసుకోవచ్చు. అపుడు 2014 పొత్తులు రిపీట్ కావచ్చు. ఇక్కడ ఒక మాట ఎవరు ఎటు వైపు వెళ్ళినా మానినా కానీ బీజేపీతో పొత్తు ఉంటేనే ఆ సెంటిమెంట్ పండుతుంది. సక్సెస్ కూడా వస్తుంది అంటున్నారు. అందుకే అన్నీ తెలిసిన సోము వీర్రాజు మేము పొత్తులకు దూరం అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.