Begin typing your search above and press return to search.

ఏపీ బీపీ : బీజేపీ హై లెవెల్ పాలిటిక్స్...?

By:  Tupaki Desk   |   7 Jun 2022 10:22 AM GMT
ఏపీ బీపీ : బీజేపీ హై లెవెల్ పాలిటిక్స్...?
X
ఏపీ మీద ఫోకస్ పెడుతున్నామని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే అలాంటి సీన్ ఏదీ అసలు కనిపించదు. ఏ ఆరు నెలలకో ఒక జాతీయ నాయకుడు వచ్చి హడవుడి చేయడం తప్ప బీజేపీకి దూకుడు పెంచే యాక్షన్ ప్లాన్ ఏదీ ఈ రోజుకీ లేదనే చెప్పాలి. తాజాగా జేపీ నడ్డా ఏపీకి వచ్చారు. ఆయన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయన రాకతో జనాలను పెద్దగా కదిలించేది ఏమీ లేదు.

ఏపీలో ఊపు రావాలీ అంటే మోడీ అయినా అమిత్ షా అయినా వచ్చి తీరాలి. అయితే వారి చూపు అంతా తెలంగాణా మీదనే ఉంది. అక్కడ ఫైటింగ్ చేస్తున్నారు. పదవులు పంచిపెడుతున్నారు. పదే పదే పర్యటనలూ చేస్తున్నారు. తాజాగా తెలంగాణాకు చెందిన బీజేపీ కార్పోరేటర్లందరితో మోడీ సమావేశం అవుతున్నారు అంటే ఆ పార్టీ తెలంగాణాకు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి అన్నది చెబుతుంది.

ఇంకో వైపు చూస్తే తెలంగాణాకే గవర్నర్ పదవులు, రాజ్యసభ ఎంపీ పదవులు, కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఏమైనా కూడా అక్కడే. మరి ఏపీ సంగతేంటి. అంటే ఏపీలో బీజేపీ హై లెవెల్ పాలిటిక్స్ చేస్తోంది. అంటే మిగిలిన పార్టీలో కలి రేపి తాను తమాషా చూస్తూండడం అన్న మాట. జనసేన ఇపుడు బీజేపీ మిత్రపక్షంగా ఉంది. కానీ ఆ పార్టీతో కలసి పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. రోడ్డు మ్యాప్ ఏదీ అని అడిగినా ఇవ్వడంలేదు.

ఇక టీడీపీతో కలసి బీజేపీ ముందుకు వెళ్ళాలనుకోవడంలేదు. మరి బీజేపీ ఏమీ చేయకుండా ఏపీలో బీపీ ఎలా పెంచుతోంది అంటే ఇలాగే తాను ఉన్నానూ అని భ్రమలు కల్పిస్తూ అపుడపుడూ సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ మిగిలిన పార్టీలలో బీపీలు పెంచుతుంది. ఇక ఏపీ విషయంలో పాలిటిక్స్. ఎందుకంటే ఆ పార్టీ ఒక రకమైన స్ట్రాటజీ తోనే ఇలా చేస్తోంది అంటున్నారు.

ఏపీలో బీజేపీ పాలిటిక్స్ నల్లేరు మీద నడకగానే చూడాలని చెబుతున్నారు. జగన్ కాంగ్రెస్ వ్యతిరేక భావజాలమే బీజేపీని ఆయనతో సానుకూలంగా ఉండేలా చేస్తుంది అంటున్నారు. రేపటి రోజున ఆరు నూరు అయినా జగన్ కచ్చితంగా కాంగ్రెస్ ని మద్దతు అయితే ఇవ్వరు. అంతే కాదు, కాంగ్రెస్ ఉన్న లేక మద్దతు ఇచ్చే కూటమి వైపు కూడా ఆయన చూడరు. ఒక విధంగా ఆయన కాంగ్రెస్ నీడను కూడా బాయ్ కాట్ చేసేశారు.

అలాంటి జగన్ అంతటి నిష్టాగరిష్టుడు అయిన జగన్ ఉన్నాడు కాబట్టే 2024 ఎన్నికల విషయంలో బీజేపీ బేఫికర్ గా ఉంది. ఇక ఏపీలో బీజేపీ యాక్షన్ ఎలా ఉన్నా చివరికి 2024 ఎన్నికల తరువాత వైసీపీ మద్దతు బీజేపీకి ఇచ్చినా షాక్ తినాల్సిన పనే లేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ ఎంపీలు వస్తే జాతీయ రాజకీయాలలో మరోమారు ఆ పార్టీవే చక్రాన్ని తిప్పుగలదు అని కూడా ఊహిస్తున్నారు.

ఇక బీజేపీ జనసేన బంధం ఎలా ఉంది అంటే ఆయన వీళ్ళను నమ్మేలా లేడు, వీరు ఆయన్ని నమ్మేలా సీన్ కనిపించడం లేదు అంటున్నారు. ఏదో నాటికి ఏదో రోజున టీడీపీ వైపుకే జనసేన వెళ్తుంది అని బీజేపీ అనుమానిస్తోంది అంటున్నారు. అంటే చంద్రబాబు కోరుకున్నట్లుగా జనసేనతో కలసిపోటీ చేస్తారు అనే ఆ పార్టీ అంచనాలు ఉన్నాయి.

అందుకే పవన్ మా సీఎం అభ్యర్ధి అని బీజేపీ ప్రకటించదు అని చెబుతున్నారు. ఇక నడ్డా అంటున్న మాట కూడా అదే పొత్తుల సంగతి తరువాత బీజేపీని ఏపీలో బలోపేతం చేయండి అని. మరో రెండేళ్ళలో ఎన్నికలు ఉన్న వేళ ఏపీలో బీజేపీ నోటా కంటే ముందుకు దూసుకువచ్చి ప్రధాన పార్టీలతో పోటీ పడుతుంది అంటే అది అంత నమ్మశక్యమైన విషయం కానే కాదు. అయినా సరే ఏపీలో బీజేపీ సౌండ్ చేస్తూనే ఉంటుంది.

మిగిలిన పార్టీలో బీపీ పెంచుతూ తాను మాత్రం సేఫ్ జోన్ లో ఉంటుంది. ఇక ఏపీలో వైసీపీ గెలిస్తేనే బీజేపీకి 2024 ఎన్నికల్లో కేంద్రంలో రాజకీయం లాభం అన్నది ఒక ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ ఏపీలో చేసే హల్ లెవెల్ పాలిటిక్స్ లో పడి మిగిలిన పార్టీలు జుత్తు పీక్కుంటే మాత్రం సుఖం లేదనే చెప్పాలేమో.