Begin typing your search above and press return to search.

మమతపై మైండ్ గేమ్ మొదలుపెట్టారా ?

By:  Tupaki Desk   |   28 July 2022 12:55 PM IST
మమతపై మైండ్ గేమ్ మొదలుపెట్టారా ?
X
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లే ఉంది. బీజేపీ నేత మిథున్ చక్రబర్తి మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 38 మంది ఎంఎల్ఏలు తమపార్టీతో టచ్ లో ఉన్నారంటు చెప్పారు. 38 మంది ఎంఎల్ఏల్లో 22 మందైతే డైరెక్టుగా తనతోనే టచ్ లో ఉన్నట్లు మీడియా సమావేశంలో చెప్పటం బెంగాల్లో సంచలనంగా మారింది. అంటే మిథున్ మాటల్లో అర్ధమేంటంటే 38 మంది తృణమూల్ ఎంఎల్ఏలు తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు చెప్పటమే.

ఇందులో నిజమెంతో అబద్ధమెంతో ఇప్పుడే ఎవరు చెప్పలేరు. కాకపోతే లాజికల్ గా ఆలోచిస్తే 38 మంది తృణమూల్ ఎంఎల్ఏలు బీజేపీ నేతలతో టచ్ లో ఎందుకున్నట్లు ? అనేది పాయింట్.

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసినట్లు కూల్చేసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ, అమిత్ షా అనుకుంటున్నారా ? అన్న చర్చ మొదలైంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే 298 మంది ఎంఎల్ఏలున్న బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరైనా 149 మార్కు దాటాల్సిందే.

ప్రస్తుతం బీజేపీకి ఉన్నది 70 మంది ఎంఎల్ఏలు మాత్రమే. మిథున్ చెప్పినట్లు 38 మంది ఎంఎల్ఏలు నిజంగానే టచ్ లో ఉన్నా కమలం పార్టీ బలం 108కి చేరుకుంటుందంతే. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 41 మంది ఎంఎల్ఏలను ఎక్కడినుండి తెచ్చుకుంటారు ? అసలు ఇంతమంది ఎంఎల్ఏలు తృణమూల్ నుండి ఇప్పటికప్పుడు ఎందుకు బయటకు వచ్చేస్తారు ?

మిథున్ చెప్పినట్లు 38 మంది ఎంఎల్ఏలు బీజేపీలో చేరినా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయలేరు కదా. మరపుడు ఎలాగూ ఫలితం రాదని తెలిసి వ్రతం చెడగొట్టుకుంటారా ? నిజంగానే ప్రభుత్వాన్ని కూల్చేసే పరిస్ధితే వస్తే మమత అసెంబ్లీని రద్దుచేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా వెళుతుంది. అంతేతప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం బీజేపీకి మాత్రం ఇవ్వరు.

ప్రభుత్వాన్ని రద్దుచేస్తే ఎన్నికల నిర్వహన కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళిపోతుంది. దాన్ని అడ్డంపెట్టుకుని కేంద్రం బాగా జాప్యం చేయించే అవకాశముంది. బీజేపీ వైఖరిని జనాలు హర్షిస్తారా ? చూద్దాం ఏం జరుగుతుందో