Begin typing your search above and press return to search.

బాబు ఫోన్ రికార్డులు తీస్తే..విష‌యం తెలిసిపోతుంది

By:  Tupaki Desk   |   30 May 2018 5:05 PM GMT
బాబు ఫోన్ రికార్డులు తీస్తే..విష‌యం తెలిసిపోతుంది
X
తెలుగుదేశం పార్టీ మ‌హానాడును ఆ పార్టీ పండుగ అనేకంటే...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ వ్య‌తిరేక స‌భ అన్న‌ట్లుగా నిర్వ‌హించార‌నే రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ‌ను నిజం చేసేలా...బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు మాట్లాడారు. మ‌హానాడు వేదిక‌గా బీజేపీపై, ప్ర‌ధాని మోడీపై చంద్ర‌బాబు విరుచుకుప‌డిన నేప‌థ్యంలో జీవీఎల్ సైతం అదే రీతిలో ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. టీడీపీది మహానాడు కాదని.. అది ఓ దగానాడు అని జీవీఎల్ ధ్వజమెత్తారు.ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్రబాబును చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోందని అన్నారు. ఏడాది కింద ఏం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇష్టమైనట్లు ట్విస్టులు, టర్నులు తీసుకోవడానికి సినిమా కాదని అన్నారు. చంద్రబాబు టీడీపీ బలహీనపడినప్పుడల్లా ఎన్టీఆర్ భజన చేస్తారని అన్నారు. తాజా మ‌హానాడులో అదే క‌నిపించింద‌ని జీవీఎల్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సొంత డబ్బు కొట్టుకోవడం తప్ప, కేంద్రం చేసింది చెప్పరని జీవీఎల్ మండిపడ్డారు.

మ‌హానాడు వేదిక‌గా చంద్ర‌బాబు అనేక సొల్లు క‌బుర్లు చెప్పార‌ని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గుజ‌రాత్ కోసం ప్ర‌త్యేక నిధులు ఇచ్చారని, సర్దార్ విగ్రహానికి కేంద్రం 3వేల కోట్లు ఇచ్చిందని బాబు అన‌డంపై జీవీఎల్ మండిప‌డ్డారు. ప‌టేల్ విగ్ర‌హం కోసం ఇచ్చింది రూ. 300కోట్లు అని పేర్కొన్న జీవీఎల్ సొల్లు కబుర్లు చెప్పకుండా ఆధారాలతో రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.బోలేరో సిటీ అంటూ దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై జీవీఎల్ మండిపడ్డారు. ఢిల్లీ-ముంబై కారిడార్ ప్రాంతంలో 2010-11లో 8 ఇండస్ట్రియల్ ఏరియాలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఇందులో భాగంగానే గుజరాత్ రాష్ట్రంలో బోలేరో అనే ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో నిర్మించేది కేపిటల్ కాదని, ఇండస్ట్రియల్ సిటీ అని పేర్కొంటూ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది అదొక్కటేనని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 54వేల కోట్లు ఇవ్వలేదని, కేవలం 2500-3వేల కోట్లు మాత్రమే ఇస్తోందని జీవీఎల్ చెప్పారు. ఈ మొత్తానికి స్పెషల్ పర్పస్ వెహికిల్ రాష్ట్రం ఇస్తోందని, ఇందులో కేంద్రం సగం వాటా ఉందని అన్నారు. కేంద్రం 98వేల కోట్ల రూపాయలు ఇస్తోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. సీనియ‌ర్ అని చెప్పుకొనే చంద్ర‌బాబుకు బోలేరో సిటీకి, ఇండ‌స్ట్రీయ‌ల్ సిటీకి తేడా తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు.

దేశ‌వ్యాప్తంగా ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లలో ఏపీని కూడా చేర్చామ‌ని ఆయ‌న వివ‌రించారు. బెంగళూరు-ముంబై, చెన్నై-ముంబై, చెన్నై-విశాఖ, అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. చెన్నై-ముంబై కారిడార్లలో నెల్లూరులోని కృష్ణపట్నం కూడా ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చేయడం జరుగుతోందని అన్నారు. 12వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, 1600ఎకరాలను కేంద్రం ప్రస్తుతానికి తీసుకుందని చెప్పారు. గుజరాత్‌లోలాగే కృష్ణపట్నంకు కూడా 2500-3వేల కోట్ల నిధులను కేంద్రం అందిస్తుందని జీవీఎల్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రానికి ఒక ఇండిస్ట్రియల్ సిటీ ఇస్తే.. ఏపీకి మూడు ఇచ్చామని చెప్పారు. ఈ నెలలోనే దీనిపై స‌మావేశం జరిగిందన్నారు. చంద్రబాబు సొంత డబ్బు కొట్టుకోవడం తప్ప, కేంద్రం చేసింది చెప్పరని జీవీఎల్ మండిపడ్డారు. హోదా కంటే ఎక్కువ సాధించామని చెప్పిన చంద్రబాబు.. యూసీలు మాత్రం ఇవ్వడం లేదని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

పొత్తు గురించి చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు చిత్రంగా ఉన్నాయ‌ని జీవీఎల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు పొత్తు కోసం ఎంత తాపత్రయపడ్డారో ఫోన్ రికార్డులు చూస్తే తెలుస్తుంద‌ని అన్నారు. తప్పుడు పనులు చేయడం టీడీపీకి కొత్తేంకాదని అన్నారు. దేశంలో ఎవరు ఎవర్నైనా ప్రశ్నించవచ్చని.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం బాబును ప్రశ్నిస్తారా? అంటూ బెదిరిస్తున్నారని అన్నారు. దమ్కీలు ఏమైనా ఇస్తున్నారా? అని అన్నారు. ఏపీలో ప్రజా ప్రభుత్వం ఉదా? మాఫియా ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. తాము ప్రజల్లోకి వెళుతున్నామని, టీడీపీని ఎండగడతామని అన్నారు.