Begin typing your search above and press return to search.

దుబ్బాక సంబరం మూణ్నాళ్ల ముచ్చటేనా?

By:  Tupaki Desk   |   13 Nov 2020 9:15 AM IST
దుబ్బాక సంబరం మూణ్నాళ్ల ముచ్చటేనా?
X
పెద్ద గీతను చెరపకుండా చిన్నది చేయాలంటే? ఎక్కువగా బుర్ర బద్ధలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సింఫుల్ గా దానికి మించిన పెద్ద గీత గీస్తే సరే. లెక్క సెట్ అవుతుంది. ఈ చిన్న సూత్రాన్నే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో కావాలని డిసైడ్ అయ్యారా? దుబ్బాక ఓటమి వేదనను వెంటనే అధిగమించేందుకు ఆయన మాస్టర్ ప్లాన్ వేశారా? ఒక్క గెలుపుతో టీఆర్ఎస్ పని అయిపోలేదని.. వాపును బలుపుగా భావిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటానికి వీలుగా రంగం సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

గ్రేటర్ ఎన్నికల్ని ముందుగా నిర్వహించాలన్న యోచనకు వచ్చిన కేసీఆర్.. అందుకు తగ్గట్లు పావులు కదిపినట్లుగా చెబుతున్నారు. దుబ్బాక ఓటమి నేపథ్యంలో.. ఇదే మాత్రం సరైన సమయం కాదని చాలామంది భావిస్తారు. కానీ.. అందరూ చూసే ప్రతికూలంలో సానుకూలం వెతికి పట్టుకోవటమే కేసీఆర్ ప్రత్యేకత. అందరిలా ఆలోచిస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు?

ఇప్పటికిప్పుడు గ్రేటర్ ఎన్నికలు కాకున్నా.. రానున్న రెండు..మూడు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలన్నది కేసీఆర్ ప్లాన్. అందరూ టీఆర్ఎస్ బలహీనంగా ఉందని భావిస్తారు. అలాంటప్పుడే ప్రత్యర్థుల అంచనాలకు మించి పని చేస్తే.. ఫలితం తమ సొంతమవుతుందన్నది కేసీఆర్ ఆలోచన. గులాబీ పార్టీకి ఉన్నట్లే.. మిగిలిన అన్ని రాజకీయపార్టీలకు బలాలు.. బలహీనతలు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో తన బలాన్ని కాపాడుకొని.. బలహీనతల్ని బుజ్జగింపులతో కవర్ చేస్తే.. గ్రేటర్ లో తిరుగులేని అధిక్యత సొంతమవుతుందన్నది కేసీఆర్ ఆలోచన.

దుబ్బాక ఫలితాన్ని రాజకీయ ప్రత్యర్థులు.. మీడియా.. సోషల్ మీడియా అవసరానికి మించిన హైప్ క్రియేట్ చేశారన్నది కేసీఆర్ అంచనా. బీజేపీ తన బలాన్ని వాస్తవానికి మించినట్లుగా భావిస్తున్న వేళ.. వారి ఓవర్ కాన్ఫిడెన్సును తన బుద్ధిబలంతో దెబ్బ తీయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతారు. ఇప్పటివరకు అందుతున్నసమాచారం ప్రకారం గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ దీపావళి తర్వాత ఏ క్షణంలో అయినా వెలువడుతుందని చెబుతున్నారు. అదే జరిగితే.. డిసెంబరు మొదటి.. రెండు వారాలకు పోలింగ్.. ఓట్ల లెక్కింపు మొత్తం లెక్క తేలిపోయే అవకాశం ఉంది.

గ్రేటర్ లో పార్టీల బలాబలాల్ని చూస్తే..
ముందుగా అధికార టీఆర్ఎస్ విషయానికి వస్తే.. 150 డివిజన్లలో మజ్లిస్ పోటీ చేసే స్థానాలు తప్పించి.. మిగిలిన వాటి మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే వంద సీట్లలో గులాబీ కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఐదు నుంచి పది మందికి మాత్రమే సీట్లు మార్చే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన వారిని యథాతధంగా ఉంచేయటం ద్వారా టికెట్ల కోసం ఆశించే వారికి సింపుల్ గా చెక్ పెట్టేయొచ్చు. సిట్టింగులకు సీట్లు ఇవ్వటాన్ని వారు కాదనలేరు. బలమైన వారు ఉంటే.. వారిని బుజ్జగించటం.. వారికి ఏం చేయాలో అది చేస్తామన్న హామీతో వారిని కూల్ చేసే వీలుంది. అయినప్పటికీ పది నుంచి ఇరవై మంది వరకు రెబెల్ అభ్యర్థులు ఉన్నా.. వారిని కట్టడి చేసేందుకు అవసరమైన ప్లానింగ్ సిద్ధంగా ఉందంటున్నారు.

ఇలా చూసినప్పుడు.. టీఆర్ఎస్ కు గ్రేటర్ లో పెద్దగా ఇబ్బందులు లేనట్లే. కాంగ్రెస్ విషయానికి వస్తే..బలమైన నేతలు కొద్ది మందే ఉన్నారు. కానీ.. గడిచిన కొంతకాలంగా వారు నిద్రాణంగా ఉండటంతో ఇప్పటికిప్పుడు యాక్టివేట్ కావటం కాస్త కష్టం. అభ్యర్థుల ఎంపికకు పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ.. గెలుపు విషయంలోనే సందేహాలు. టీఆర్ఎస్ అభ్యర్థులతో పోలిస్తే.. ఆర్థికంగా ధీటైన అభ్యర్థులు రంగంలోకి తీసుకొస్తే అంతో ఇంతో ఫలితం ఉంటుంది. లేకుంటే.. ఇప్పటి మాదిరి సింగిల్ డిజిట్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.

బీజేపీ విషయానికి వస్తే..దుబ్బాక ఫలితం వరకు గ్రేటర్ మీద వారి ఫోకస్ పరిమితమే. ఫలితం వచ్చాక కొత్త ఆశలు చిగురించాయి. అయితే.. వారి బలహీనతల్ని వారు మర్చిపోతున్నారు. గ్రేటర్ లో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. కిషన్ రెడ్డి ఉన్నా.. ఆయన చక్రం తిప్పే అవకాశాలు పెద్దగా లేవంటున్నారు. లక్ష్మణ్.. ఎన్వీఎస్ ప్రభాకర్.. చింతల రామచంద్రారెడ్డి లాంటి నేతలు ఉన్నప్పటికి.. వారి పాత్ర కేవలం నాలుగైదు నియోజకవర్గాలకు దాటదు. రాజాసింగ్ ప్రాతినిధ్యం వహించే గోషామహల్ వద్ద కూడా అంత ప్రభావం చూపించే వీల్లేదంటున్నారు.

మజ్లిస్ తో ఢీ కొట్టే అభ్యర్థులు లభించటం కష్టమంటున్నారు. అన్నింటికి మించి అతి పెద్ద ఇబ్బందేమంటే.. ఉన్నట్లుండి ఎన్నికలు వచ్చేస్తే.. గ్రేటర్ మొత్తంగా అభ్యర్థుల ఎంపికే కష్టమన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంగానే.. బీజేపీకి గ్రేటర్ లో ఉన్న అవకాశాలు చాలా పరిమితమని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాము తొంభై స్థానాల్ని సొంతం చేసుకుంటామని చెప్పటానికి మించిన జోక్ మరొకటి లేదంటున్నారు. తొంబై స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపితే గొప్పన్న మాట వినిపిస్తోంది. కాకుంటే.. కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ కు ఇబ్బంది పెట్టే బలాన్ని బీజేపీ ప్రదర్శించే వీలుంది.

చివరగా మజ్లిస్ విషయానికి వస్తే.. ఆ పార్టీకి ఉన్న బలం బహిరంగమే. వారి సిట్టింగ్ స్థానాల్ని ఒక్క డివిజన్ మిస్ కాకుండా వారి ఖాతాలో వేసుకుంటారు. దీంతో.. వారి సీట్లకు వచ్చే నష్టం.. ప్రమాదం ఏమీ ఉండదన్నది మర్చిపోకూడదు. మొత్తంగా చూస్తే.. వెనువెంటనే ఎన్నికలు జరిగితే..లాభం టీఆర్ఎస్ కే.