Begin typing your search above and press return to search.

ఆ పదవులన్నీ కేసీఆర్ భిక్ష అయితే.. సీఎంసాబ్ కు సోనియా భిక్ష వేశారా?

By:  Tupaki Desk   |   5 Oct 2021 5:31 AM GMT
ఆ పదవులన్నీ కేసీఆర్ భిక్ష అయితే.. సీఎంసాబ్ కు సోనియా భిక్ష వేశారా?
X
మాటకు ఉండే ప్రత్యేకత.. అంతా ఇంతా కాదు. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్లు.. మాటను ప్రయోగించే తీరు ఆధారంగా సదరు మాటలు వరాలుగా కొన్నిసార్లు.. శాపాలుగా మరికొన్నిసార్లు మారుతుంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్నే తీసుకుంటే.. కదిలించి తిట్టించుకునే కొన్ని పనులకు ఆయన శ్రీకారం చుడతారు. తాజాగా ఆయన నోటి నుంచి ఆ తరహా మాటలే వచ్చాయి. ఈ మధ్యన విపక్షాలు హుషారుగా మారటం.. యాక్టివిటీలు పెంచటంతో కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇలాంటివేళ.. వికారాబాద్జిల్లా మోమిన్ పేట మండలానికి చెందిన పలువురు.. నల్గొండ జిల్లా చండూరు మున్సిపల్ ఛైర్మన్ చంద్రకళతోపాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న వేళ.. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. టీపీసీసీ .. టీబీజేపీ అధ్యక్ష పదవులు కేసీఆర్ పెట్టిన భిక్షగా పేర్కొన్న కేటీఆర్.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని పట్టుకొని కాంగ్రెస్.. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి కేటీఆర్ మాటలే నిజమని అనుకుందాం. టీపీసీసీ.. టీబీజేపీ పదవులన్ని కేసీఆర్ భిక్షగా అనుకుంటే.. కేసీఆర్ కు వచ్చిన సీఎం పదవి ఎవరి భిక్షగా చెప్పాలి కేటీఆర్ అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎవరెన్ని చెప్పినా.. చెప్పకున్నా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? ఆ మాటకు వస్తే.. ఇప్పుడిన్ని మాటలు చెబుతున్న మంత్రి కేటీఆర్ సైతం.. మంత్రి పదవి అన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఈ తరహా మాటలు సీఎం కేసీఆర్ కు లాభం కంటే కూడా నష్టాన్నే ఎక్కువగా కలిగిస్తాయన్న ప్రాధమిక విషయాన్ని మంత్రివర్యులు ఎప్పటికి గుర్తిస్తారో? ఒక మాట అనటం ఈజీనే. కానీ.. దానికి కౌంటర్ గా వచ్చే మాటల్ని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు పెట్టుకుంటే చాలన్న మాట వినిపిస్తోంది.