Begin typing your search above and press return to search.

కేకే ఓటుపై ట్విస్ట్‌...టీఆర్ ఎస్ పార్టీకి షాకే!

By:  Tupaki Desk   |   5 Feb 2020 5:13 AM GMT
కేకే ఓటుపై ట్విస్ట్‌...టీఆర్ ఎస్ పార్టీకి షాకే!
X
టీఆర్ ఎస్ పార్టీకి షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. తుక్కుగూడ మున్సిపాలిటీలో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన‌ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు ఓటు వేయ‌డం - అక్క‌డ టీఆర్ ఎస్ చైర్మ‌న్ సీటు కైవ‌సం చేసుకోవ‌డం తెలిసిన సంగ‌తే. అయితే, ఏపీ కోటా నుంచి ఎంపీగా ఉన్నారని రాజ్యసభ సెక్రటేరియెట్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రాజ్యసభ కార్యదర్శి దీపక్ కల్రా.. బీజేపీ స్టేట్‌ చీఫ్‌ లక్ష్మణ్‌ కు మంగళవారం ఎంపీల జాబితా పంపించారు.

ఉత్కంఠభ‌రితంగా సాగిన తుక్కుగూడలో మొత్తం 15 మంది కౌన్సిలర్లకు 9 మంది బీజేపీ - ఐదుగురు టీఆర్ ఎస్ - ఇండిపెండెంట్(బీజేపీ రెబల్) ఒకరు గెలిచారు. ఇక్కడ చైర్మన్‌‌ - వైఎస్‌‌ చైర్మన్‌‌ పదవులు బీజేపీకి దక్కాల్సి ఉండడంతో టీఆర్ ఎస్ ఇక్కడ ఏకంగా ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులను రంగంలోకి దింపి ఇండిపెండెంట్‌‌ గా గెలిచిన బీజేపీ రెబల్‌‌ ను చైర్మన్‌‌ గా ఎంపిక చేసింది. దీనిపై భగ్గుమన్న బీజేపీ.. కేకే ఓటు వేయడాన్ని తప్పుపట్టింది. తెలంగాణ కోటాలో ఉన్న కేవీపీని నేరేడుచర్లలో ఓటు వేయకుండా అడ్డుకున్న అధికారులు - ఏపీ కోటాలో ఉన్న కేకేను ఇక్కడ ఎలా ఓటు వేయడానికి అనుమతిస్తారని ప్రశ్నించింది.

కేకే ఏపీ కోటాలో ఎంపీగా ఉన్నార‌ని పేర్కొంటూ...తెలంగాణ కోటాలో ఎక్స్ అఫీషియో ఓటు వేయడంపై బీజేపీ రాష్ట్ర నేతలు శనివారం రాజ్యసభ చైర్మన్ - ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాజ్యసభ.. కె.కేశవరావు తెలంగాణ కోటాలో లేరని వివరణ ఇచ్చింది. రాజ్యసభ క్లారిటీ ఇవ్వడంతో కేకేతోపాటు ఆయన ఓటు వేయడానికి సహకరించిన రిటర్నింగ్ అధికారి - ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో కేసు వేస్తామని బీజేపీ తెలిపింది. ఈ పరిణామం టీఆర్ ఎస్‌ ను ఇరకాటంలో పడేసింది.