Begin typing your search above and press return to search.

'రివర్స్‌ ఆపరేషన్‌' పై బీజేపీ భయం

By:  Tupaki Desk   |   4 Aug 2019 7:00 AM IST
రివర్స్‌ ఆపరేషన్‌ పై బీజేపీ భయం
X
గతవారం అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్‌ కు కొత్త చిక్కు వచ్చి పడింది. మంత్రివర్గ కూర్పు బీజేపీ నాయకులకు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసి వారం గడిచినా ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. అప్పుడు.. ఇప్పుడు అంటూ రోజుకో కొత్త తేదీలను వెల్లడిస్తూ బీజేపీ సర్కార్‌ కాలం వెల్లదీస్తోంది. మంత్రివర్గ కూర్పు తర్వాత స్థానం దక్కని ఆశావహులు, అసంతృప్తులు తిరుగుబావుట ఎగురవేస్తారనే భయం బీజేపీని ఆరంభం నుంచి వెంటాడుతోంది. తిరుగుబావుట ఎగురవేసినా ఫరవాలేదు కానీ వారు కాంగ్రెస్‌ పార్టీతో జట్టు కడితేనే ఇబ్బంది తలెత్తుతుందని బీజేపీ నేతలు ఆలోచనలో పడ్డారు. మంత్రి పదవి దక్కని నేతలు రివర్స్‌ ఆపరేషన్‌ (ఆపరేషన్‌ హస్తం)కు గురై బీజేపీ సర్కారు మనుగడకు ఇబ్బంది తెచ్చే ప్రయత్నాలు ఉండడంతో అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణతో సుమారు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు రివర్స్‌ ఆపరేషన్‌ కు గురయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఎలాంటి అసంతృప్తులు లేకుండా మంత్రివర్గ విస్తరణ చేయడం బీజేపీకి కత్తి మీద సాములా మారిపోయింది. గతంలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూడా ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలతోనే కూలిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని బీజేపీ నేతలు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కర్ర విరగకుండా.. పాము చావకుండా ఉన్న చందంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని జాగ్రత్తలు వహిస్తున్నారు.

కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు రోజురోజుకి ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఎలాగైనా పదవి దక్కించుకోవాలని లాబీయింగ్‌ లు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మధ్య ఉన్న తీవ్ర పోటీతో బీజేపీకి, యడియూరప్పకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా మంత్రివర్గ జాబితాను యడియూరప్ప సిద్ధం చేస్తున్నారు. పార్టీ పెద్దలు, ప్రముఖ నేతలతో వరుసగా భేటీ అవుతూ చర్చిస్తున్నారు.

సామాజికవర్గం- జిల్లా- ప్రాంతం- సీనియారిటీ వంటి లెక్కలను పరిగణనలోకి తీసుకుని జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకోవాల్సింది.. కానీ పూర్తి జాబితా సిద్ధం కాని కారణంగా ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. అంతా ఫైనల్‌ అయ్యాకే రావాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో చివరి నిమిషంలో ఆగిపోయారు. కాగా ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకోనున్నారు. అయితే ఈ నెల 9 లేదా 11న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.