Begin typing your search above and press return to search.

తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి కరోనా

By:  Tupaki Desk   |   1 Jun 2020 2:30 PM GMT
తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి కరోనా
X
తెలంగాణలొో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరగడం కలవరపెడుతోంది. తాజాగా, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడ్డారు. కోవిడ్19 టెస్టుల్లో చింతలకు పాజిటివ్ అని తేలింది. అనుమానంతో చింతల కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం చింతల కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. చింతల రామచంద్రా రెడ్డి, ఆయన భార్య, కుమారుడు..జుబ్లిహిల్స్ అపోలోలో చికిత్స పొందుతున్నారు. లాక్ డౌన్ సమయంలో చింతల రామచంద్రారెడ్డి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆ సమయంలో ఆయన కరోనాబారిన పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు.

తనకు వైరస్ సోకిందని.. అయితే తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని చింతల తెలిపారు. ఆందోళన చెందొద్దని బీజేపీ శ్రేణులు, కార్యకర్తలను కోరారు. వాస్తవానికి లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందనే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారవాణా వల్ల కేసుల సంఖ్య రెట్టింపవుతోందని, ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారని అంటున్నారు. లాక్ డౌన్ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. ఓ పక్క లాక్ డౌన్ సడలింపుల వల్ల జన జీవనం సాధారణ స్థాయికి చేరుకుంటున్నప్పటికీ.....మరో పక్క కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.