Begin typing your search above and press return to search.

శ‌త్రుఘ్న‌కు షాకేనా!... బీజేపీ వ్యూహం ఇదేనా?

By:  Tupaki Desk   |   17 March 2019 11:04 AM GMT
శ‌త్రుఘ్న‌కు షాకేనా!... బీజేపీ వ్యూహం ఇదేనా?
X
మోదీ మేనియాతో ముగిసిన ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించి అప్పుడే ఐదేళ్లు పూర్తి అయిపోతోంది. మ‌రోసారి కీల‌క ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. అయితే గ‌తంలో మాదిరిగా ఈ ద‌ఫా మోదీ మేనియా అంత‌గా ప‌నిచేసే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. బ‌లమైన ప్ర‌త్య‌ర్థి లేర‌న్న ఒకే ఒక్క నేప‌థ్యంతో బీజేపీ అధికారం చేజిక్కించుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. మ‌రి ఈ త‌ర‌హా వ్యూహం వ‌ర్క‌వుట్ కావాలంటే...ముందుగా సొంత కుంప‌ట్ల‌ను ఆర్పుకోవాల్సిందే క‌దా. బీజేపీని మ‌రోమారు గెలిపించుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు ఇదే వ్యూహంపై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. గ‌డ‌చిన ఎన్నిక‌ల దాకా పార్టీతోనే సాగి, పార్టీ అదుపాజ్ఞ‌ల్లోనే న‌డిచిన చాలా మంది నేత‌లు మోదీ ప్ర‌ధాని అయ్యాక స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంగా త‌యారైపోయారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ‌త్రుఘ్న సిన్హా.

బాలీవుడ్ లో పేరొందిన న‌టుడిగా మంచి గుర్తింపు సంపాదించిన శ‌త్ర‌ఘ్న‌... రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేశారు. రాజ‌కీయ ఎంట్రీ సందర్భంగా బీజేపీలో చేరిపోయిన శ‌త్రుఘ్న‌... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ టికెట్ పైనే బీహార్ లోని ప‌ట్నా సాహిబ్ లోక్ స‌భ స్థానం నుంచి బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. అయితే ఆ త‌ర్వాత మోదీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేస్తూ స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంగా మారిపోయారు. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ... నేరుగా మోదీనే టార్గెట్ చేస్తున్న శ‌త్రుఘ్న‌.. ప్ర‌ధానితో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీ నుంచి వెళ్లిపోతార‌నే వాద‌న కూడా లేకపోలేదు. ఏ పార్టీలో చేరినా కూడా ప‌ట్నా సాహిబ్ నుంచే బ‌రిలోకి దిగుతాన‌ని కూడా శ‌త్రుఘ్న ఘ‌నంగానే ప్ర‌క‌టించారు. అయితే పార్టీలో ఉన్నంత కాలం త‌మ‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన శ‌త్రుఘ్న‌ను ఓడించేందుకు మోదీషా ద్వ‌యం ప‌కడ్బందీ ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్న‌ట్టుగా స‌మాచారం.

ఈ మేర‌కు పార్టీ అభ్య‌ర్థుల ఖ‌రారుపై నిన్న జ‌రిగిన స‌మావేశంలో ఈ విష‌యంపై కీల‌క చ‌ర్చ జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. శ‌త్రుఘ్న‌కు షాకిచ్చేందుకు ఏకంగా ఆయ‌న‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ను బ‌రిలోకి దించితే ఎలా ఉంటుంద‌న్న వాద‌న ఆ చ‌ర్చ‌లో వినిపించింద‌ట‌. నిన్న‌టి స‌మావేశంలో దీనిపై ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోకున్నా... శ‌త్రుఘ్న పార్టీకి చేసిన ద్రోహానికి త‌గిన గుణ‌పాఠం చెప్పాలంటే... ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఓడించి తీరాల్సిందేని కూడా నిర్ణ‌యించారట‌. సినీ గ్లామ‌ర్‌తో పాటు సిట్టింగ్ ఎంపీగా, వైరి వ‌ర్గాల స‌హ‌కారం ఉన్న శ‌త్రుఘ్న‌ను ఓడించాలంటే మాత్రం ర‌విశంక‌ర్ లాంటి సీనియ‌ర్లు రంగంలోకి దిగాల్సిందేన‌న్న వాద‌న కూడా బ‌లంగానే వినిపిస్తోంది. చూద్దాం.. మ‌రి శ‌త్రుఘ్న‌కు మోదీషాలు ఏ విధంగా రిటార్ట్ ఇస్తారో.