Begin typing your search above and press return to search.

అమరావతి పై బీజేపీ డబల్ గేమ్

By:  Tupaki Desk   |   22 Nov 2021 5:25 AM GMT
అమరావతి పై బీజేపీ డబల్ గేమ్
X
అమరావతిపై ఏం చేయాలో తేల్చుకోలేని బీజేపీ చివరకు డబల్ గేమ్ మొదలుపెట్టింది. తాజాగా అమరావతి కోసం జరుగుతున్న పాదయాత్రకు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, పురందేశ్వరి తదితరులు మద్దతు పలికారు. నెల్లూరు జిల్లాలోని కావలిలో పాదయాత్ర చేస్తున్న కమలనాథులు అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కంటిన్యూ అవ్వాలంటు డిమాండ్లు వినిపించారు. రాజధాని పేరుతో ఏపీని మూడు ముక్కలు కానివ్వమంటు శపథం కూడా చేశారు.

వీళ్ళ శపథాన్ని పక్కన పెట్టేస్తే మొన్నటి ఎన్నికల సమయంలో ఇదే బీజేపీ నేతలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బహుశా ఇపుడా హామీని మరచిపోయుండచ్చు. అంటే వీళ్ళ హామీ ఏమిటంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మాత్రమే. తాము ఏపీలో అధికారంలోకి వచ్చేది లేదని వీళ్ళకు కూడా బాగా తెలుసు. అందుకనే నోటికొచ్చిన హామీని ఇచ్చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తమ హామీని అమలు చేస్తానంటే మాత్రం ఇపుడు అడ్డుపడుతున్నారు.

వీళ్ళు అడ్డుపడటం సంగతిని పక్కన పెట్టేస్తే రాష్ట్ర రాజధాని అంశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టంగా ప్రకటించేసింది. ఇదే విషయాన్ని మూడుసార్లు హైకోర్టులో అఫిడవిట్ల రూపంలో కూడా చెప్పింది. ఈ విషయాన్ని కూడా కమలనాథులు మరచిపోయారేమో. హై కోర్టును కర్నూలుకు రీలొకేట్ చేయటం జగన్ చేతిలో లేదు కాబట్టే మూడు రాజధానుల ప్రతిపాదన ఇంకా పెండింగ్ లో ఉంది. ఇదే సమయంలో అమరావతి కోసం రైతులు నుండి సమీకరించిన భూమిని ఏమి చేయబోతున్నదనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు.

కాబట్టే మూడు రాజధానుల అంశం ఇంకా పెండింగ్ లో ఉంది. ఇదే విషయాన్ని కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోనే ఉన్న ఎన్డీయే ప్రభుత్వంతో లోకల్ బీజేపీ నేతలు మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒకటి చెప్పి, స్ధానిక నేతలు మరోటి చెబుతుంటే జనాల్లో కన్ఫ్యూజన్ పెరగటమే కాదు అసలు పార్టీని నమ్మే స్థితి కూడా ఉండదు. ఇప్పటికే బీజేపీకి ఓట్లూ లేవు సీట్లూ లేవు. ఇపుడు కొత్తగా రాజధాని విషయంలో కూడా డబల్ గేమ్ మొదలుపెడితే బీజేపీని జనాలు అసలు పట్టించుకోరేమో.

తప్పో ఒప్పో ఏ విషయంలో అయినా ఓ క్లారిటీ ఉండాలి. మూడు రాజధానుల వల్ల రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని జగన్ డిసైడ్ అయ్యారు. దీనివల్ల పార్టీకి కూడా ఉపయోగం ఉంటుందని అనుకున్నారు. అంటే జగన్ కు సరైన క్లారిటీ ఉంది. తన వాదన కరెక్టో కాదో తెలీదు కానీ టీడీపీ కూడా రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని కోరుకుంటోంది. మిగిలిన పార్టీల వాదనలను జనాలు పెద్దగా పట్టించుకోవటంలేదు. మరిలాంటి నేపథ్యంలో బీజేపీ ఎందుకని డబల్ గేమ్ ఆడుతోందో అర్ధం కావటంలేదు.