Begin typing your search above and press return to search.

నోటాకు ఓటువేయాలంటూ బీజేపీ ప్ర‌చారం

By:  Tupaki Desk   |   28 April 2018 5:09 AM GMT
నోటాకు ఓటువేయాలంటూ బీజేపీ ప్ర‌చారం
X
ఆశ్చ‌ర్య‌పోకండి. బీజేపీ నేత‌లే ఈ ప్ర‌చారం చేస్తున్నారు. క‌మ‌ళం గుర్తుకు కాకుండా....నోటాకు ఓటు వేయాలంటూ కోరుతున్నారు. అది కూడా చిన్నా చిత‌కా నాయ‌కులు కాదు. సాక్షాత్తు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అనుచ‌ర‌వ‌ర్గం. ఈ త‌మాషా జ‌రుగుతోంది క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో. ఈ ఎన్నిక‌ల్లో భాగంగా బీజేపీ అధిష్టానం యాడ్యురప్ప కుమారునికి టికెట్‌ నిరాకరించడంతో ఆగ్రహంతో ఉన్న ఆయన అనుచరులు ఆ పార్టీ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. టికెట్‌ దక్కించుకున్న బీజేపీ అభ్యర్థికి కాకుండా.. నోటా (నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌)కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానం(వరుణ) నుంచి సిద్ధరామయ్య ప్రాతినిథ్యం వహిస్తుండగా - ఈ సారి వరుణ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీలో ఉందామని ఆశించిన యాడ్యురప్ప కుమారుడు విజయేంద్రకు బీజేపీ అధిష్టానర మొండిచేయి చూపింది. కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే వర్గంలోని వ్యక్తి బసవరాజు టికెట్‌ దక్కించుకున్నారు.

ముందుగా బీజేపీ పెద్ద‌ల నిర్ణయంతో యెడ్డీ - విజయేంద్రలు అలకబూనినా.. అధిష్టానం 'హామీతో' శాంతించారు. కానీ విజయేంద్ర అనుచరులు మాత్రం హెగ్డే - బసవరాజుకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. హెగ్డేని ఉద్దేశించి.. సిద్ధరామయ్య కుమారుడిని గెలిపించడానికి ఎంత నగదు తీసుకున్నారంటూ కరపత్రాలు పంచుతున్నారు. ఓట్లన్ని నోటాకే వేయాలని.. దీంతో అక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే విజయేంద్రకు టికెట్‌ దక్కుతుందని వారు భావిస్తున్నారు. కాగా ఈ ప‌రిణామం పార్టీ పెద్ద‌ల దృష్టికి చేరింద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్ర‌చారం హాట్ హాట్‌ గా సాగుతోంది. ఎనిమిది మంది కళంకితులకు బీజేపీ టిక్కెట్లు కేటాయించిందని, కానీ ప్రధాని మోడీ మాత్రం కర్ణాటక ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని విమర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. తన చుట్టూ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వారిని పెట్టుకుని ప్రధాని మోడీ అవినీతి గురించి ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. గురువారం వేల కోట్ల రూపాయలతో పరారైన నిందితుడు నీరవ్ మోడీ సంగతి ప్రధాని నరేంద్రమోడీకి తెలుసునని, కానీ ఆయన గురించి ఒక్కమాట కూడా మాట్లాడరని అన్నారు. సభల్లో మోడీ పక్కన నిలిచే యెడ్యూరప్ప అవినీతి కేసులో జైలుకు వెళ్లి వచ్చారని, పక్కన నిలుచున్న మరో నలుగురు కూడా జైలుకెళ్లనున్నా - మోడీ ఇతరుల అవినీతి గురించి ఆరోపణలు చేస్తారన్నారు.