Begin typing your search above and press return to search.

తెలుగు చానెళ్ల టీఆర్పీ స్కామ్ సంగతేంటి? బీజేపీ నేత డిమాండ్

By:  Tupaki Desk   |   9 Oct 2020 5:31 PM GMT
తెలుగు చానెళ్ల టీఆర్పీ స్కామ్ సంగతేంటి? బీజేపీ నేత డిమాండ్
X
మహారాష్ట్రలో టీఆర్‌పీ రేటింగ్‌ స్కామ్ జరిగిందంటూ ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ వీర్‌ సింగ్ సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. టీఆర్‌పీల విషయంలో రిపబ్లిక్ టీవీవోపాటు మరో రెండు ఛానెళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని ఆయన వెల్లడించిన విషయాలు పెనుదుమారం రేపాయి. అయితే, ఆ ఆరోపణలను రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి ఖండించారు. రేటింగ్ లను నిర్ణయించే BARC...రిపబ్లిక్ టీవీ పేరు వెల్లడించలేదని. సుశాంత్‌ కేసులో ముంబై పోలీసులు, పరమ్ వీర్ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తమపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (BARC) రేటింగుల కోసం కొన్ని చానెళ్లు అడ్డదారులు తొక్కుతున్నాయా లేదా అన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ చానెళ్లతోపాటు కొన్ని ప్రాంతీయ చానెళ్లు కూడా టీఆర్పీ రేటింగుల కోసం అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతీయ చానెళ్లు, తెలుగు న్యూస్ చానెళ్ల టీఆర్పీ రేటింగుల వ్యవహారంపై కూడా విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. (BARC) మీటర్ల ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న కొన్ని జాతీయ, ప్రాంతీయ, తెలుగు న్యూస్ చానెళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ డిమాండ్ చేశారు. ఈ తరహా చర్యలు అనైతికమని, మీడియా చానెళ్ల విశ్వనీయతను ఆ చర్యలు దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఈ తరహా చర్యల వల్ల అడ్వర్టయిజింగ్, సేల్స్ ప్రమోషన్ల కంపెనీలు నష్టపోతాయని, తద్వారా మార్కెట్ ఎకానమీ దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖను అడ్డుపెట్టుకొని ఒక చానెల్ ను మహారాష్ట్ర సర్కార్ లక్ష్యంగా చేసుకుందని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలా జరిగిందని అన్నారు. జర్నలిజం విలువలు, న్యూస్ రిపోర్టింగ్ లో నైతికత పాటిస్తూ...చానెళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండడం తప్పుకాదని అభిప్రాయపడ్డారు.