Begin typing your search above and press return to search.

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఓట‌మి.. మోడీ హ‌వాకు బ్రేక్‌?

By:  Tupaki Desk   |   16 April 2022 2:38 PM GMT
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఓట‌మి.. మోడీ హ‌వాకు బ్రేక్‌?
X
దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీల హవానే కొనసాగింది. బిహార్లో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ.. ఆర్జేడీ అభ్యర్థి గెలుపొందారు. బంగాల్లో టీఎంసీ అభ్యర్థులు శతృఘ్న సిన్హా, బాబుల్ సుప్రియో ఘన విజయం సాధించారు. దీంతో కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. అమిత్‌షాల‌కు ప్ర‌జ‌లు బిగ్ షాక్ ఇచ్చార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఈ నెల 12న జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో అక్కడి అధికార పార్టీల హవా కొనసాగింది. అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది.

అసాంసల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి శతృఘ్ను సిన్హా, తన సమీప భాజపా అభ్యర్ధి అగ్నిమిత్రాపై 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. బల్లిగంజ్ అసెంబ్లీ స్థానంలోనూ తృణమూల్‌ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో 22వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

బిహార్‌లోని బొచహాన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రీయ జనతా దళ్‌ అభ్యర్థి అమర్‌కుమార్‌ పాసవాన్‌, తన సమీప బీజేపీ అభ్యర్థి బేబీ కుమారిపై 35 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ నార్త్‌ అసెంబ్లీ స్థానంలో అధికార మహావికాస్‌ అఘాడి అభ్యర్థి జయశ్రీ జాదవ్‌, బీజేపీ అభ్యర్థి సత్యజీత్‌ కదమ్‌పై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఛత్తీస్‌గఢ్‌లోని కైరాగర్‌ శాసనసభ స్థానంలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి యశోదా వర్మ 20 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

మహారాష్ట్ర ఉపఎన్నికలో విజయం సాధించడంపై శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్‌ స్పందించారు. మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు పెట్టడంపై వివాదస్పదం చేసి ఉపఎన్నికల ప్రచారంలో దిగిన బీజేపీ ఎత్తులు ఫలించలేదని రౌత్‌ ఎద్దేవా చేశారు. రామనవమి ఉత్సవాల్లో మతపరమైన అల్లర్లును సృష్టించి, ఉపఎన్నికల్లో లబ్ధి పొందాలన్న బీజేపీ వ్యూహం ఫలించలేదనని శివసేన ఎంపీ అన్నారు.

కొల్హాపూర్‌ ఓటర్లు లౌడ్‌ స్పీకర్ల వివాదాన్ని సద్దుమణిగేలా ఉపఎన్నికల్లో తీర్పు ఇచ్చారని రౌత్‌ అభిప్రాయపడ్డారు. నాసిక్‌లోని కలరామ్ ఆలయాన్ని సందర్శించిన సంజయ్‌రౌత్‌, ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఫ‌లితాల‌పై బీజేపీ జాతీయ నాయ‌కులు అప్పుడే.. చ‌ర్చ ప్రారంభించారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో విజ‌యం ఇచ్చిన మ‌జా నుంచి తేరుకోక ముందే.. తాజాగా జ‌రిగిన ఉప పోరులో ఘోర ప‌రాజ‌యంపై ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు.