Begin typing your search above and press return to search.

బీజేపీ నియంత్రణలో ఫేస్ బుక్, వాట్సప్?

By:  Tupaki Desk   |   17 Aug 2020 10:00 AM IST
బీజేపీ నియంత్రణలో ఫేస్ బుక్, వాట్సప్?
X
ప్రస్తుతం దేశంలో ఎవ్వరు ఏదైనా మాట్లాడవచ్చు. వాక్ స్వాతంత్ర్యానికి అందరికీ హక్కు ఉంది. ప్రభుత్వాలను తిడుతున్నా.. ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నా.. ఎవ్వరూ ఏమీ అనడం లేదు. అయితే అమెరికాలో మాత్రం అధ్యక్షుడు ట్రంప్ విద్వేశ పూరిత వ్యాఖ్యలుచేసినా.. రెచ్చగొట్టేలా.. ప్రజలను ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించినా ఫేస్ బుక్, ట్విట్టర్ లు తొలగించేస్తున్నాయి.కానీ భారత్ లో ఆ సాహసం చేయలేకపోతోంది

తాజాగా భారతదేశంలో పాలక బీజేపీ నేతలు విచ్చలవిడిగా విద్వేశపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.. కానీ ఇదే ఫేస్ బుక్ వాట్సాప్ లు చూసీ చూడనట్లు వదిలేస్తుందని.. చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’లో సంచలన కథనం ప్రచురితమైంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలను కూడా ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం లో ప్రస్తావించింది. భారత్ లో తన వ్యాపార లావాదేవీలు దెబ్బ తినకుండా ఉండేందుకే ఫేస్ బుక్ ఇలా చేస్తోందని ఆ కథనంలో రాశారు. ఇది పెను సంచలనమై దేశంలోని పలు పత్రికలు, వెబ్ సైట్లు ఇదే విషయంపై బీజేపీ పై విమర్శలు చేశాయి.

కాగా ది వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నల్ కథనంలో ఫేస్ బుక్ భారత కార్యకలాపాలు చూసే ప్రతినిధి అంఖీ దాస్ మాటలను ఉటంకించింది. బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే భారత్ లో మన బిజినెస్ మీద ప్రభావం పడే అవకాశం ఉందని..అందువల్ల వారికి హేట్ స్పీచ్ రూల్స్ ను అమలు చేయవద్దని ఈ కథనం వెల్లడించింది.

తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు దేశంలో ఫేస్ బుక్, వాట్సాప్ లను నియంత్రిస్తున్నారని ఆయన ఆరోపించారు.

‘ఫేస్ బుక్, వాట్సాప్ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అదుపులో ఉన్నాయి. ఫేక్ న్యూస్ ను, విద్వేషాలను రెచ్చగొట్టడంలో బీజేపీకి సహకరిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి’ అని ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. చివరకు అమెరికా మీడియాకే ఫేస్ బుక్ పై అసలు నిజాలు బయట పెట్టింది అంటూ రాహుల్ విమర్శించారు.

ఇక రాహుల్ వ్యాఖ్యలు బీజేపీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. తమ సొంతవారిని కూడా ప్రభావితం చేయలేని వారు.. ప్రపంచం మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభావితం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారని’ ఆయన విమర్శించారు. మీరే గతంలో ఫేస్ బుక్ సాయం తీసుకొని దొరికిపోయారని కౌంటర్ ఇచ్చారు.