Begin typing your search above and press return to search.

'4' వ్యూహాల్నే న‌మ్ముకున్న బీజేపీ.. కాంగ్రెస్‌.. జేడీఎస్‌

By:  Tupaki Desk   |   19 May 2018 4:17 AM GMT
4 వ్యూహాల్నే న‌మ్ముకున్న బీజేపీ.. కాంగ్రెస్‌.. జేడీఎస్‌
X
గడిచిన కొన్ని రోజులుగా ట్విస్టుల మీద ట్విస్టులతో ఆసక్తికరంగా మారిన కర్ణాటక రాజకీయం అంతిమదశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో చోటు చేసుకునే పరిణామాలు.. కర్ణాటక రాజ్యాధికారం ఎవరిదన్నది తేల్చేలా చేస్తుందని చెప్పాలి.

తమకు లేని 8 మంది ఎమ్మెల్యేల బలాన్ని సంపాదించుకునేందుకు మోడీ పరివారం ప్రయత్నిస్తుంటే.. మోడీ బ్యాచ్ కు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల్ని వారికి చిక్కకుండా చేసేందుకు కాంగ్రెస్.. జేడీఎస్ నేతలు కిందా మీదా పడుతున్నారు. ఇందుకు పలు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీజేపీతో పాటు కాంగ్రెస్.. జేడీఎస్ పార్టీలన్ని నాలుగు వ్యూహాల మీదనే ఫోకస్ పెట్టటం విశేషంగా చెప్పాలి.

తాము ఫైనల్ చేసిన నాలుగు వ్యూహాల్లో ఏదో ఒకటి వర్క్ వుట్ అవుతుందని ఉభయులు ఆశించటం కనిపిస్తోంది. అంతిమ విజయం తమదేనంటూ బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్.. జేడీఎస్ నేతలు సైతం ఒకేలాంటి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్.. జేడీఎస్ లతో పోలిస్తే.. బీజేపీ మాటల్లో తుది గెలుపుపై ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.

ఇంతకీ ఈ మూడు పార్టీలు అనుసరిస్తున్న 4 వ్యూహాలు ఏమిటి? అన్నది చూస్తే.. మొదట బీజేపీ నాలుగు వ్యూహాలు ఎలా ఉండనున్నాయో చూస్తే..

వ్యూహం 1

బలపరీక్ష వేళ..అసెంబ్లీకి కనీసం 14 నుంచి 16 మంది జేడీఎస్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యేలా చూడడం. ఇదే జరిగితే శాసనసభలో బలపరీక్షకు అవసరమైన మేజిక్ నంబర్ను సులభంగా చేజిక్కించుకోవచ్చు. అయితే దీని వల్ల అనర్హత ముప్పు పొంచి ఉంటుంది. ఒకవేళ అనర్హత ముప్పుపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అనర్హత వేటు పడ్డ వారికి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున టికెట్ ఇచ్చి గెలిపించుకోవటం.. ఆ తర్వాత వారికి కీలక పదవులు ఇవ్వటం.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం.

వ్యూహం 2

కాంగ్రె్సకు చెందిన 8 మంది లింగాయత్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకొని వారితో క్రాస్ ఓటింగ్ చేయించటం. తద్వారా బలపరీక్షలో నెగ్గేలా చూడటం. పార్టీ విప్కు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీకి ఓటేస్తే అనర్హత తప్పదు. అలాంటి వారికి ముందు చెప్పినట్లుగా అండగా నిలుస్తామన్న హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

వ్యూహం 3

ఇప్పటికే తమ శిబిరంలో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్ - ప్రతాప్ గౌడ్ పాటిల్ లతో పాటు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవచ్చు. శాసనసభలో బలపరీక్షకు అవసరమైన 111 మెజార్టీని సాధించే అవకాశం లభిస్తుంది. బీజేపీకి 104 మంది బలం ఉంది. ఇప్పటికే తమ శిబిరంలో ఉన్న ఇద్దరిని కలుపుకొంటే ఈ బలం 106కు పెరుగుతుంది. అంటే మేజిక్ నంబర్కు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తోడైతే సరిపోతుంది.

వ్యూహం 4

ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్ జేడీఎస్ ల నుంచి ఎమ్మెల్యేలు తమ వైపు రావడం సాధ్యం కాదని తేలిన పక్షంలో బలపరీక్షకు సిద్ధం కాకుండా 1996లో అప్పటి ప్రధాని వాజ్ పేయి లాగే యడ్యూరప్ప కూడా రాజీనామా సమర్పించడం. ఇలా చేయడం వల్ల తమకు ప్రజల్లో సానుభూతి పవనాలు వెల్లువెత్తుతాయని కమలనాథుల అంచనా.

జేడీఎస్ - కాంగ్రెస్ 4 వ్యూహలివే!

వ్యూహం 1

హైదరాబాద్ నుంచి తమ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించిన అనంతరం వారిని నేరుగా అసెంబ్లీ సమావేశాలకు తీసుకురావడం.

వ్యూహం 2

ఎమ్మెల్యేలు ఎవరూ చేజారి పోకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ ఎమ్మెల్యేలను శనివారం సాయంత్రం 4 గంటల వరకు పర్యవేక్షించడం. వారి కదలికలపై నిఘా పెట్టటం. అదే తీరులో జేడీఎస్ సీనియర్ నేతలు కూడా ఇదే ఫార్ములా అనుసరించటం.

వ్యూహం 3

శాసనసభలో తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో కలవకుండా సాధ్యమైన వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

వ్యూహం 4

ఒకవేళ తమ ప్రయత్నాలు విఫలమై.. బీజేపీతో తమ ఎమ్మెల్యేలు చేతులు కలిపితే కుయుక్తితో విజయం సాధించారన్న సందేశాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేయటం.. ప్రభుత్వానికి పాలించే నైతికత లేదంటూ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయటం.. ప్రజల్లో యడ్డీ సర్కారుపై వ్యతిరేకత పెంచేలా ద్రోహ ముద్రను వేయటం.