Begin typing your search above and press return to search.

బీజేపీ బీజియ‌మ్ : ఏపీలో యూపీ పాలిటిక్స్ .. ఓవ‌ర్ టు క‌డ‌ప

By:  Tupaki Desk   |   19 March 2022 4:30 PM GMT
బీజేపీ బీజియ‌మ్ : ఏపీలో యూపీ పాలిటిక్స్ .. ఓవ‌ర్ టు క‌డ‌ప
X
బీజేపీకి కొత్త శ‌క్తి వ‌చ్చిందా లేదా కొత్త నీరు వ‌చ్చి చేర‌నుందా? ఇవే ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న విష‌యాలు. ఎందుకంటే యూపీ గెలుపుతో ఒక్క‌సారి ఆంధ్రా రాజ‌కీయాల్లో కూడా మార్పులు వ‌స్తున్నాయి.ఎన్న‌డూ లేని విధంగా రెండు ప్ర‌ధాన జాతీయ పార్టీలు అయిన బీజేపీ, ఆమ్ ఆద్మీ ఇక్క‌డి రాజ‌కీయాల‌పై మ‌న‌సు ఎందుక‌నో పారేసుకుంటున్నాయి.అంటే ద‌క్షిణాదిలో గ‌తంలో వ‌చ్చిన ఓట‌ముల‌ను దిద్దుకునే ప్ర‌య‌త్నం బీజేపీ చేస్తుంటే, క‌నీస స్థాయిలో అయినా ఓట‌రును ప్ర‌భావితం చేసి త‌మ ఉనికిని చాటుకునేందుకు ఆప్ ప్ర‌యాస ప‌డుతోంది.ఇదే స‌మ‌యాన వీటికి భిన్నంగా రాష్ట్ర రాజ‌కీయాలలో కొన్ని ప‌రిణామాలున్నాయి.

వాటిని అర్థం చేసుకుని ఆ రెండు జాతీయ పార్టీలూ రాజ‌కీయం చేయ‌గ‌ల‌వా అన్న‌ది ఓ పెద్ద ప్ర‌శ్న. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఏపీలో యూపీ త‌ర‌హా పాలిటిక్స్ వ‌ర్కౌట్ అవుతాయా? అంటే యోగి వ‌చ్చి ఇక్క‌డ ప్రచారం చేసినా లేదా ఆయ‌న సూత్ర క‌ర్త లేదా విధాన‌క‌ర్త అయిన స‌త్య‌కుమార్ నేతృత్వాన బీజేపీ (ఏపీ విభాగం) ప‌నిచేసినా ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయి అన్న‌ది ఓ చ‌ర్చ. వాస్త‌వానికి బీజేపీ ప్ర‌భావం ఏపీలో లేక‌పోయినా రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల‌లో చీలిక తెచ్చే వ్యూహం ఏద‌యినా స‌త్య‌కుమార్ చేస్తే మాత్రం ఏపీ బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సేఫ్ !

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఎన‌లేని మార్పు వ‌చ్చింది.ఆ విధంగా బీజేపీ మంచి ఫ‌లితాలు అందుకుంది.స్థిర ప్ర‌భుత్వం ఏర్పాటుకు మార్గం సుగ‌మం అయింది. అంటే వ‌రుస‌గా రెండోసారి ఓ జాతీయ పార్టీ అధికారం కైవ‌సం చేసుకోవ‌డం అన్న‌ది ఆషామాషీ వ్య‌వ‌హారం అయితే కాదు. ఓట్లు మ‌రియు సీట్ల రాజ‌కీయంలో యోగి మొన్న‌టి వేళ కాస్త వెనుక‌బ‌డ్డార‌న్న వాద‌న ఉన్నా కూడా ఆయ‌న మార్కు హ‌వాకు తిరుగే లేద‌ని తేలిపోయింది.స‌హ‌జంగానే ఉండే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను కూడా స‌మాజ్ వాదీ పార్టీ త‌న‌కు అనుగుణంగా మ‌లుచుకోలేక‌పోయింది.

ఆ విధంగా సైకిలు పార్టీ ఏ విధంగానూ యోగికి గ‌ట్టిపోటీ ఇవ్వ‌లేక‌పోయింది. పోనీ కాంగ్రెస్ మాత్రం ఏమయినా సాధించిందా అంటే లేద‌నే చెప్పాలి.ఇంత‌టి ఘోర ప‌రాజ‌యం త‌రువాత అంతా యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ స‌క్సెస్ ఫార్ములా ఏంట‌న్న‌ది తెలుసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.ఆ రోజు గుజరాత్ మోడ‌ల్ అంటూ ఆక‌ర్ష‌ణీయ మాట‌ల‌తో కూడిన ప్ర‌సంగాల‌తో ఊద‌ర‌గొట్టిన బీజేపీ నాయ‌కులు ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నారు. ఇప్పుడు యూపీ మంత్రం జ‌పిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో యూపీ లో అమ‌లు అయిన స‌క్సెస్ ఫార్ములాను తీసుకుని దేశ వ్యాప్తంగా బీజేపీ మ‌ళ్లీ వెలిగిపోవాల‌ని చూస్తోంది.వాస్త‌వానికి యోగి వెనుక ఉండి మొత్తం ప్ర‌చార సంరంభాన్ని తీర్చిదిద్దింది మ‌న తెలుగు వాడు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలో కీల‌క వ్య‌క్తి వై.స‌త్య‌కుమార్. క‌డ‌ప జిల్లాకు చెందిన ఈ పెద్దాయ‌న ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌పై కూడా ఫోక‌స్ ఉంచారు. కార్పొరేట్ రాజ‌కీయాలు,సానుభూతి రాజ‌కీయాలు చేయాల‌ని ప్ర‌బోధ చేసే ప్ర‌శాంత్ కిశోర్ క‌న్నా స‌త్య కుమార్ ఎన్నో రెట్లు మేలు అన్న‌ది బీజేపీ నుంచి ఇవాళ వినిపిస్తున్న వాద‌న.

అందుకే ఇవాళ ఏపీలో క‌డ‌ప కేంద్రంగా స‌త్య‌కుమార్ ఓ భారీ స‌భ‌కు శ్రీ‌కారందిద్దుతున్నారు. రాయ‌ల సీమ ర‌ణ‌భేరి పేరిట ఆయ‌న ఈ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. నిరుత్సాహంగా ఉన్న బీజేపీ శ్రేణుల‌లో కొత్త ఆనందాలు తీసుకుని రావాల‌ని ఆయ‌న సంక‌ల్పిస్తున్నారు.రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్న‌డూ ముందుంటుంద‌ని అంటున్నారు. త‌మ స‌భ ద్వారా వైసీపీ ప్ర‌భుత్వం ఆలోచ‌నా విధానంలో మార్పు తీసుకుని వ‌స్తామ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.