Begin typing your search above and press return to search.

కర్ణాటక ఉప ఎన్నికల పోరు ..11 స్థానాల లో ఆధిక్యం లో బీజేపీ !

By:  Tupaki Desk   |   9 Dec 2019 5:46 AM GMT
కర్ణాటక ఉప ఎన్నికల పోరు ..11 స్థానాల లో ఆధిక్యం లో బీజేపీ !
X
కర్ణాటక లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లోనే వెలువడనున్నాయి. దీనితో దేశ మొత్తం కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఈ నెల 5న 15 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల పై న్యాయస్థానాల్లో కేసులు ఉండటంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో అసెంబ్లీలో మిగిలిన 222 కు గాను మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్‌తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. ఇవాళ వెల్లడయ్యే ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆరు సీట్లు సాధిస్తేనే .. బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేకపోతె ఎడియూరప్ప ప్రభుత్వం మైనార్టీ లో పడిపోతుంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కి 66, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో ఇటీవలే కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఆ స్తనాలకి ఉపఎన్నికలు జరిగాయి. ఇకపోతే ఈరోజు ఉదయం పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో బీజేపీ 11 స్థానాల్లోనూ, కాంగ్రెస్‌ రెండు చోట్ల , ఒకచోట జేడీఎస్‌, మరో చోట ఇండిపెండెంట్ అభ్యర్థులు మెజార్టీ లో ఉన్నట్టు సమాచారం వచ్చింది. కావాల్సిన దానికంటే ఎక్కువమంది ముందంజ లో కొనసాగుతున్న నేపథ్యంలో కమలనాథులు ఊపిరి పీల్చుకుంటున్నారు.