Begin typing your search above and press return to search.

'ఫామ్‌హౌజ్' ఇష్యూ పోగొట్టిందా? బీజేపీలో చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   7 Nov 2022 2:30 AM GMT
ఫామ్‌హౌజ్ ఇష్యూ పోగొట్టిందా?  బీజేపీలో చ‌ర్చ‌
X
తెలంగాణ‌ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ ఎస్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. బీజేపీపై టీఆర్ ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 10,309 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని సెమీ ఫైనల్‌గా భావించిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించి, సర్వశక్తుల్ని ధారపోశాయి. దేశ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్న ఈ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించుకొని తమ సత్తా చాటాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది.

అయితే, ఎన్నిక‌ల‌కు ప‌ది రోజుల ముందు తెర‌మీదికి వ‌చ్చిన `ఫామ్‌హౌజ్ ఇష్యూ` ఫ‌లితాన్ని తారుమారు చేసింద‌ని బీజేపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. టీఆర్ ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించారన్న ఆరోపణలు వ్యవహారం కూడా మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపినట్టు బీజేపీ నాయ‌కులు తాజాగా త‌మ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు కేవ‌లం ప‌ది రోజుల ముందు వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాల వీడియో, ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

ఈ అంశాన్ని టీఆర్ ఎస్ బీజేపీపై ఓ అస్త్రంగా ఉపయోగించుకుంది. రైతులు పండించిన వడ్లు కొనరు గానీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను రూ.కోట్లతో కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారంటూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ లు పదే పదే విమర్శలు ఎక్కుపెట్టడంతో ఇది ప్ర‌జ‌ల్లోకి జోరుగా వెళ్లింది. దీంతో పాటు తెలంగాణ బిడ్డ‌ల‌ను కొనుట సాధ్య‌మేనా? అంటూ.. చండూరులో కేసీఆర్ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌తో పెరేడ్ నిర్వ‌హించి.. మ‌రోసారి తెలంగాణ సెంటిమెంటును రాజేశారు.

అయితే, దీనిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌డంలోనూ.. మాట‌ల మాంత్రికుడు కేసీఆర్‌కు దీటుగా తిప్పికొట్ట‌డంలోనూ బీజేపీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఇప్పుడు వారి మ‌ధ్యే చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, చేనేత కార్మికులకు బీమా ప్రకటించడం, చేనేతపై జీఎస్టీకి వ్యతిరేకంగా కేంద్రంపై కేటీఆర్‌ విమర్శలు, వివిధ సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రకటించిన పలు హామీలను కూడా బీజేపీ స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌లేక పోవ‌డం.. లేదా అంత‌కుమించి హామీలు ఇవ్వ‌డంలోనూ.. విఫ‌ల‌మైంద‌ని నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. చివ‌ర‌కు ఏం తేలుస్తారో చూడాలి.