Begin typing your search above and press return to search.

కోడ్ ఉన్నా.. లెక్క‌లేదు.. ఎమ్మెల్యే అభిమానం.. వైసీపీని రోడ్డున ప‌డేసిందే!

By:  Tupaki Desk   |   14 Nov 2021 3:25 AM GMT
కోడ్ ఉన్నా.. లెక్క‌లేదు.. ఎమ్మెల్యే అభిమానం.. వైసీపీని రోడ్డున ప‌డేసిందే!
X
రాజ‌కీయాల్లో పార్టీ అధినేత‌లకు అభిమానులు కోకొల్ల‌లు. ఎక్క‌డిక‌క్క‌డ త‌మ అభిమానం చూపించుకునేందు కు నాయకులు  పోటీ ప‌డుతుంటారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. ఇలాంటి వారి వ‌ల్ల  ఆయా పార్టీలకు మేలు జ‌రుగుతుంద‌ని భావించినా.. ఒక్కొక్క‌సారి మాత్రం.. ఇబ్బందు లు త‌ప్ప‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా అధికార వైసీపీలో ఇలాంటి అభిమాన నేత‌ల కార‌ణంగా.. పార్టీ ఇరుకున ప‌డుతోంది. మ‌రీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న బియ్య‌పు మ‌ధుసూద‌న రెడ్డి.. అభిమానం.. ఎప్ప‌టిక‌ప్పుడు వివాదం అవుతోంది.

సీఎం జ‌గ‌న్ దృష్టిలో ప‌డి.. మంచి మార్కులు కొట్టేయాల‌న్న యావ‌లో మ‌ధు చేస్తున్న ప‌నులు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తున్నాయి. క‌రోనా స‌మ‌యంలో గ‌త ఏడాది.. ఆయ‌న 100 ట‌న్నుల బియ్యాన్ని.. పేద‌ల‌కు పంచేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో 100 లారీల‌నుఏర్పాటు చేసి.. శ్రీకాళ‌హ‌స్తిలో పెద్ద ఎత్తున ఊరేగించారు. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటోంద‌ని.. చెప్ప‌డానికే తాను ఇలా చేశాన‌న్నారు. అయితే.. క‌రోనా తీవ్ర‌త ఈ ర్యాలీ త‌ర్వాత‌.. శ్రీకాళ‌హ‌స్తిని వ‌ణికించింద‌ని.. టీడీపీ స‌హా.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక మీడియా.. గ‌గ్గోలు పెట్టింది.

దీనికి బియ్య‌పు దూకుడే కార‌ణ‌మ‌ని.,. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ప్ర‌భుత్వం దీనికి వివ‌ర‌ణ ఇచ్చుకోలేక పోయింది. ఇక‌, ఇది జ‌రిగిన త‌ర్వాత బియ్య‌పు మ‌ధు కొన్ని రోజులుమీడియాకు ముఖం చాటేశారు. అయితే.. ఇప్పుడు మ‌రో అంశంతో ఆయ‌న వైసీపీని అడ్డంగా ఇరికించేశార‌నే వాద‌న వ‌స్తోంది. తాజాగా చూపించిన‌`అభిమానం`.. వైసీపీని ఇర‌కాటంలోకి నెట్టేసింది. రేపు(ఆదివారం) తిరుప‌తిలో స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం  ఏర్పాటైంది. దీనికి  బీజేపీ నాయ‌కుడు, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా హాజ‌ర‌వుతున్నారు. అదేవిధంగా సీఎం జ‌గ‌న్‌, ఇత‌ర రాష్ట్రాల పాల‌కులు హాజ‌రుకానున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై అభిమానం చాటుకునేందుకు ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో అమిత్‌షా, జ‌గ‌న్ ఇద్ద‌రూ ఉన్నారు. అయితే చిత్తూరు జిల్లాలో  ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమ‌ల్లో ఉంది. దీంతో జిల్లాలో ఎలాంటి ఫ్లెక్సీలు, ఇత‌ర‌త్రా ప్ర‌చార అంశాలు కోడ్ ఉల్లంఘ‌న కింద వ‌స్తాయ‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ హ‌రినారాయ‌ణ హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ.. ఎమ్మెల్యే ఎప్ప‌ట్లాగే జ‌గ‌న్‌పై త‌న ప్రేమాభిమానాల్ని ఫ్లెక్సీల రూపంలో ప్ర‌ద‌ర్శించారు.

దీంతో ఇంకేముంది.. అవ‌కాశం కోసం చూస్తున్న విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కోడ్ ఉల్లంఘించినా క‌లెక్ట‌ర్ స్పందించ‌లేదంటూ ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు జ‌న‌సేన‌, బీజేపీ తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాయి. ఇక‌, అదేస‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ నేత‌లు రాష్ట్రానికి వ‌స్తే.. ఇలాంటి ఫ్లెక్సీల‌ను ఎవ‌రూ ఏర్పాటు చేయ‌లేదు. దీంతో ఇప్పుడు బీజేపీతో వైసీపీ అంత‌ర్గ‌త స్నేహం కొన‌సాగిస్తోంద‌న‌డానికి ఇది ఉదాహ‌ర‌ణ అని .. ప్ర‌తిప‌క్షంలోని మ‌రో వ‌ర్గం.. రాష్ట్ర‌స్థాయిలో విమ‌ర్శ‌ల‌కు దిగేందుకు రెడీ అయింది. ఇలా చూసుకుంటే.. బియ్య‌పు మ‌ధు అభిమానం.. వైసీపీని రెండు విధాలా ఇర‌కాటంలోకి నెట్టింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.