Begin typing your search above and press return to search.

బిత్తిరి స‌త్తిపై దాడి...ఆసుప‌త్రికి త‌ర‌లింపు!

By:  Tupaki Desk   |   27 Nov 2017 12:36 PM GMT
బిత్తిరి స‌త్తిపై దాడి...ఆసుప‌త్రికి త‌ర‌లింపు!
X
`తీన్మార్‌` వార్త‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌లో బిత్తిరి స‌త్తి బాగా పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ లో తాను ప‌నిచేసే చానెల్‌ కార్యాల‌యానికి వెళ్తున్న బిత్తిరి సత్తి పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడి చేశారు. త‌న కార్యాలయానికి సమీపించిన సమయంలో సత్తిపై హెల్మెట్ తో దాడి జరిగింది. దీంతో, స‌త్తి ముఖంపై తీవ్ర గాయాల‌య్యాయి. అప్ర‌మ‌త్త‌మైన చానెల్ సిబ్బంది ఆ దుండ‌గుల‌ను వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. వెంట‌నే సత్తిని బంజారాహిల్స్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

ఆ నిందితుల‌ను పంజాగుట్ట పోలీసుల‌కు చానెల్ సిబ్బంది అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ ప్రారంభించిన పోలీసులు ఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌పై వారు విచార‌ణ జ‌రుపుతున్నారు. స‌త్తికి ప్రాణాపాయం లేద‌ని, రెండు రోజుల పాటు ఆసుప‌త్రిలో త‌మ‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాలని వైద్యులు సూచించారు. త‌న‌దైన శైలిలో, ప్ర‌త్యేక‌మైన హావ‌భావాల‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌లో బిత్తిరి స‌త్తి ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ర‌క‌ర‌కాల వ్యంగ్యాత్మ‌క కాన్సెప్ట్ ల‌తో స‌మ‌కాలీన అంశాల‌పై వ‌స్తున్న‌ తీన్మార్ వార్త‌లే కాకుండా అనేక టీవీ కార్య‌క్ర‌మాల్లో స‌త్తి పాల్గొంటున్నాడు. కొద్ది రోజుల నుంచి బిత్తిరి స‌త్తికి సినిమాల‌లో కూడా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో స‌త్తి పాత్ర‌కు మంచి గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

దాడికి పాల్ప‌డ్డ వ్య‌క్తిని చానెల్ సిబ్బంది ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే, ఆ వ్య‌క్తి ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్లుగా అత‌డు మాట్లాడుతున్నాడు. ఆ వ్య‌క్తి సికింద్రాబాద్‌ కళాసిగూడకు చెందిన మణికంఠ(26) అని తెలుస్తోంది. కొద్ది రోజుల నుంచి బిత్తిరి సత్తిపై దాడి చేసేందుకు రెక్కి నిర్వహించానని, అందుకే బిత్తిరి సత్తి కోసం అత‌డి ఆఫీసు వ‌ద్ద వేచి చూశానని ఆ వీడియోలో మ‌ణికంఠ‌ తెలిపాడు.

ఆ చానెల్‌లో తెలంగాణ భాషను బిత్తిరి సత్తి కించపరుస్తూ మాట్లాడటం తాను భరించలేకపోయానని మణికంఠ చెప్పాడు. తాను సినిమా దర్శకుడిగా, రచయితగా ఉన్నానని, తాను చదివిన పుస్తకాల్లో సత్తి యాస లేదన్నారు. అందుకే, సత్తిపై దాడి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పాడు. ఇంకోసారి తెలంగాణ భాష గౌరవాన్ని దెబ్బతీయవద్దని చెప్పేందుకు దాడికి పాల్పడ్డట్లు అంగీక‌రించాడు. తెలంగాణ గురించి, దేశం గురించి ఆ ఛానెల్ చెడుగా ప్ర‌చారం చేస్తోంద‌ని, ఆ చానెల్ అంతుచూస్తాన‌ని అన్నాడు. అయితే, స‌ద‌రు ఛానెల్ తెలంగాణ భాష‌, యాస‌లోనే వార్త‌లు ప్ర‌సారం చేస్తూ తెలంగాణ ఖ్యాతిని పెంచుతోంద‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో, మ‌ణికంఠ మాన‌సిక స్థితిపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే, మ‌ణికంఠ పూర్తివివ‌రాలు, దాడికి గ‌ల కార‌ణాలు పోలీసుల నుంచి అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంది.