Begin typing your search above and press return to search.

కుక్క కరిస్తే... నక్క తోక తొక్కినట్లే!

By:  Tupaki Desk   |   12 April 2015 8:08 AM GMT
కుక్క కరిస్తే... నక్క తోక తొక్కినట్లే!
X
కుక్క కరవడం ఏమిటి, నక్క తోక తొక్కడం ఏమిటి అనుకుంటున్నారా? వస్తున్నా... వస్తున్నా... అక్కడికే వస్తున్నా! సాదారణంగా కుక్క కరిస్తే గతంలో బొడ్డుచుట్టూ ఇంజెక్షన్లు అనే భయం అందరిలోనూ ఉండేది. అది కాస్త ఒక్క ఇంజెక్షన్ కి వచ్చింది. కానీ... కరిచినప్పుడు పడే బాదకి ఎన్ని ఇంజెక్షన్లు ఇస్తే మాత్రం మరిచిపోగలం చెప్పండి? అందుకే ఇకపై కుక్క కరిస్తే... వారిని లక్షాధికారులు చేసేయాలని నిర్ణయించింది ఉత్తరాఖండ్ హైకోర్టు!
కుక్క కాటుకు ఇంతకాలం పిచ్చోల్లయిన వారినే చూసాం కానీ... ఇకపై కుక్క కరవడం వల్ల లక్షాధికారులైన వారిని కూడా చూస్తాం. ఉత్తరాఖండ్‌లో కుక్క కరిచినా, కోతి కరిచినా... అక్షరాలా రెండు లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. కుక్క కాటు బాధితులకు రూ.2లక్షల వరకూ పరిహారం చెల్లించాలని ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ పరిహారంలో సగం వాటా మున్సిపల్‌ కార్పొరేషన్‌ది కాగా, మిగిలిన సగం ప్రభుత్వం చెల్లించాలన్నది కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం కుక్క లేదా కోతి కరిస్తే... తీవ్రంగా గాయపడితే రెండు లక్షలు, ఒక మోస్తరు గాయాలకు లక్ష రూపాయల నష్టపరిహారం వస్తుంది. గడచిన మూడేళ్ల కాలంలో లో ఒక్క నైనిటాల్‌లోనే నాలుగు వేలకుపైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయని తెలిసుకుని మండిపడ్డ హైకోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అన్ని చొట్లా వర్తిస్తే బాగుండు అంటారా? ఆశ దోస...