Begin typing your search above and press return to search.

నేరగాళ్లకి వరంగా మారిన బిట్ కాయిన్స్..ఎలా అంటే !

By:  Tupaki Desk   |   31 Oct 2020 6:00 AM IST
నేరగాళ్లకి వరంగా మారిన బిట్ కాయిన్స్..ఎలా అంటే !
X
బిట్‌ కాయిన్‌...రూపం లేని డిజిటల్‌ మనీ. 2008లో దీనిని కంప్యూటర్‌ ప్రోగ్రాం ద్వారా సతోషి నకమోటో అనే వ్యక్తి తయారు చేశారని చెబుతారు. ఈ బిట్ కాయిన్ 2009 నుంచి వాడుకలో వచ్చింది. దీనిని ఎవరు ఎక్కడి నుంచి కంట్రోల్‌ చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. ఎక్కువ సామర్థ్యం కల్గిన కంప్యూటర్ల సమూహం ద్వారా తయారు చేసిన ఈ డిజిటల్‌ మనీకి బిట్‌కాయిన్‌ అనే పేరు పెట్టారు. కేవలం 21 వేల మిలియన్ల బిట్‌ కాయిన్లు మాత్రమే ఉంటాయి. ఇప్పటికే 16 వేల మిలియన్ల బిట్‌ కాయిన్లు అమ్ముడుపోయాయి. పరిమితమైన సంఖ్యలో ఈ బిట్‌కాయిన్లు ఉండటంతో వీటికి ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరిగి, దాని విలువ రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్‌ విలువ రూ. 10 లక్షలకు పైగానే ఉంది. షేర్‌ మార్కెట్‌ మాదిరిగానే బిట్‌కాయిన్‌ కొనుగోలు, అమ్మకాలు నిత్యం జరుగుతుంటాయి. ఈ బిట్ కాయిన్ ఎవరు కొంటున్నారు ,ఎవరు అమ్మవుతున్నారు అనే విషయం ఎవరికి తెలియదు. దీనితో దీన్ని ఇప్పుడు నేరగాళ్లు తమకి అనుకూలంగా మలుచుకుంటున్నారు.

హ్యాకర్లు, కిడ్నాపర్లు సైబర్ ‌నేరగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో రూపాయలు, డాలర్లు, పౌండ్లు, యూరో తదితర కరెన్సీలను బిట్ ‌కాయిన్లలోకి మార్చి తమకు పంపించాలంటూ డిమాండ్‌ చేస్తూ సేఫ్ ‌ గేమ్‌ ఆడుతున్నారు. బిట్‌ కాయిన్‌ రూపం లో డిమాండ్‌ చేస్తున్న ఘటనలు ఇటీవల హైదరాబాద్ ‌లోనూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సైబరాబాద్‌ పరిధిలో కిడ్నాప్ ‌నకు గురైన డాక్టర్‌ ను నేరగాళ్లు రూ. 10 కోట్లు డిమాండ్‌ చేశారు... వాటిని కూడా బిట్‌ కాయిన్లలో తమకు పంపించాలంటూ సూచించారు. ఇప్పుడు ఈ బిట్‌ కాయిన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితం హైదరాబాద్‌ లో జరిగిన ఇద్దరు వ్యాపారుల బ్యాంక్‌ ఖాతాల హ్యాకింగ్‌ ఘటనల్లో రూ. 86 లక్షలు, ముంబైలో జరిగిన రూ. 2 కోట్లలో 60 శాతం బిట్‌ కాయిన్లలోకి మార్చి, వాటిని నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్లకు కోల్‌కతాలో ఉంటూ మధ్యవర్తిత్వం చేసిన సైబర్‌ చీటర్స్‌ పంపించారు.

నైజీరియన్‌ సైబర్‌ నేరగాడు ఎక్కడో ఉండి ఖాతాలు హ్యాక్‌ చేశాడు. హ్యాక్‌ చేసిన తరువాత నగరానికి చెందిన వ్యాపారుల ఖాతాల నుంచి డబ్బును కోల్‌కతాలోని కొందరి ఖాతాల్లోకి బదిలీ చేయించాడు. ఆ బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు సరఫరా చేసే ముఠా, సైబర్‌ నేరగాడు కొట్టేసిన మొత్తం సొమ్ములో 40 శాతం తమ సొంతానికి వాడుకుని, మిగతాది నైజీరియన్‌ సైబర్‌నేరగాడు పంపించిన ఒక లింక్‌తో అతడి బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ ఖాతాను ఓపెన్‌ చేసి, అందులో బిట్‌కాయిన్లు కొనేశారు. దీంతో ఆ డబ్బంతా అతడికి డిజిటల్‌ రూపంలోకి మారిపోయింది. .. బిట్‌కాయిన్లలోనే పేమెంట్‌ చేయాలంటూ ఇటీవల ఎక్కువగా అడుగుతున్నారు. ఈ బిట్‌కాయిన్స్‌ ద్వారా సులువుగా పెద్ద మొత్తంలో డబ్బు పంపించుకోవచ్చు. ఈ బిట్‌కాయిన్ల ద్వారా షాపింగ్‌ చేసుకునే అవకాశం కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్లు ఇక్కడ కొళ్లగొడుతున్న డబ్బును బిట్‌కాయిన్ల ద్వారా తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకుంటున్నారు