Begin typing your search above and press return to search.

మోడీకి అల్టీమేటం.. జీఎస్టీ తగ్గిస్తారా? మూసేయాలా?

By:  Tupaki Desk   |   21 Aug 2019 5:01 PM IST
మోడీకి అల్టీమేటం.. జీఎస్టీ తగ్గిస్తారా? మూసేయాలా?
X
దేశ జీడీపీ పడిపోతోంది. మార్చిలో 5.8శాతంగా ఉంటే.. ఈ జూన్ త్రైమాసికం 5.4శాతానికి దిగజారిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన భారత ఆర్థిక వ్యవస్థ పతనం కొనసాగుతోంది. గడిచిన ఐదేళ్లలోనే ఈ సంవత్సరం గరిష్టంగా జీడీపీ పతనం కావడం దేశ పారిశ్రామిక రంగాన్ని కోలుకోకుండా చేస్తోంది. మోడీ తెచ్చిన జీఎస్టీ భారం కంపెనీలకు గుదిబండగా తయారైంది.

ముఖ్యంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతోపాటు అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, పడిపోయిన ఆటోమొబైల్ రంగం - జీఎస్టీ - రియల్ భూమ్ పతనం తదితర పరిణామాలు దేశ ఆర్థిక రంగాన్ని కోలుకోనీయడం లేదు.

ఈ ప్రభావం అందరిపై పడి ఇప్పుడు ఉద్యోగాలు ఊడిపోయి కంపెనీలు మూత పడేదాకా పరిస్థితి దిగజారింది. తాజాగా దేశంలోనే అతిపెద్ద బిస్కట్ తయారీ కంపెనీ ‘బ్రిటానియా’ చేతులెత్తేసింది. పీకల్లోతు నిర్వహణ భారం పెరిగిపోయిందని.. కేంద్రం బిస్కట్లపై జీఎస్టీని తగ్గించడమా? లేదా 10వేల మంది ఉద్యోగులను తీసివేయడమా.? రెండే ఆప్షన్లు తమకు ఉన్నాయని బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎండీ వరుణ్ బెర్రీ వాపోయారు.ఈ ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కంపెనీల తాజా పరిస్థితిని కళ్లకు కట్టినట్టైంది.

దేశంలో ఆర్థిక మందగమనం.. ఉద్యోగాల కోతతో ప్రజల దగ్గర డబ్బు కొరత.. కనీస నిల్వలు లేకపోవడంతో కొనుగోలు శక్తి హరించిందని.. కొనడానికి ముందుకు రావడం లేదని బ్రిటానియా ఎండీ వరుణ్ తెలిపారు. ఇదే తమ లాభాలపై ప్రభావం చూపి కంపెనీ ఆర్థికపతనానికి కారణమైందని ఆయన ప్రకటించారు.

ఇక మరో అగ్రశ్రేణి బిస్కట్ తయారీ కంపెనీ ‘పార్లే’ ఎండీ మయాంక్ షా కూడా బిస్కెట్లపై కేంద్రం విధిస్తున్న 18శాతం జీఎస్టీ తలకుమించిన భారమైందని.. దీనిపై ప్రధాని మోడీ - జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోకపోతే బిస్కట్ కంపెనీలు మూసివేయడమో.. ఉద్యోగాలు కోత విధించడమో తప్పదని వ్యాఖ్యానించారు. బిస్కట్లకు పడిపోయిన డిమాండ్ - అధిక జీఎస్టీతో మొత్తం బిస్కట్ల పరిశ్రమ దెబ్బతిందని ఆయన తెలిపారు.

ఇలా బిస్కెట్ తయారీ కంపెనీదారులు బహిరంగంగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీపై గళం విప్పడం పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. పరిమితికి మించి పన్నుల భారం కంపెనీలకు గుదిబండగా మారుతోందని అర్థమవుతోంది.