Begin typing your search above and press return to search.

పాక్‌ - చైనాకు ఒకే దెబ్బ చాలంటున్న ఆర్మీ

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:59 AM GMT
పాక్‌ - చైనాకు ఒకే దెబ్బ చాలంటున్న ఆర్మీ
X
స‌రిహ‌ద్దుల్లో ఇటీవ‌ల వ‌రుస‌గా క‌వ్వింపు చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్న పాకిస్థాన్‌ - చైనాల‌కు భార‌త్ ఘాటు హెచ్చ‌రిక చేసింది. సిక్కింలోని డోంగ్‌ లాంగ్ ప్రాంతంలో చైనా - భార‌త‌ దేశాల దళాలు మోహరించడంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేప‌థ్యంలో భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఒకేసారి అటు పాక్ - ఇటు చైనాతో యుద్ధం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ భార‌త‌దేశం సంయ‌మ‌నం పాటిస్తోందని తెలిపారు.

కాగా, చైనా - పాక్‌ తో పాటు భారత్‌ అంతర్గతంగా ఎదుర్కొంటున్న ముప్పుపై ఒకేసారి (టూ అండ్ హాఫ్ ఫ్రంట్ వార్) యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. యుద్ధం గురించి గగ్గోలు పెట్టడం ఆపాలని సూచించింది. అటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతా రాహిత్యమని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ వు ఖియాన్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి చరిత్ర చెప్పిన పాఠాల గురించి తెలుసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉండ‌గా...పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలోని ఎల్‌వోసీ వెంట భారత ఆర్మీ పోస్టులు, జనావాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ దళాలు గురువారం షెల్స్, మోర్టార్లతో దాడులు చేశాయి. తెల్లవారుజామున 1.30 గంటలకు దాడులు జరిగాయని, ఇద్దరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారని రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. వారిని సమీపంలోని ఆర్మీ దవాఖానకు తరలించామన్నారు. పాక్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని చెప్పారు. ఎల్‌ వోసీ వెంట ఈ నెలలో ఇప్పటివరకు పాక్ 22 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతోపాటు, రెండుసార్లు చొరబాటుకు ప్రయత్నించింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు ముగ్గురు జవాన్లు సహా నలుగురు మృతిచెందారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/