Begin typing your search above and press return to search.

బిల్లు కాదు..మీ నేతల్ని అదుపులో పెట్టుకోండి మోడీ

By:  Tupaki Desk   |   4 March 2017 8:13 AM GMT
బిల్లు కాదు..మీ నేతల్ని అదుపులో పెట్టుకోండి మోడీ
X
ఆదర్శాలు అందరూ చెప్పే వారే. కానీ.. పాటించే వారి విషయంలోనే ఇష్యూలన్నీ. రానున్న పార్లమెంటు సమావేశాల్లో.. పెళ్లిళ్ల ఖర్చు మీద కొత్త పరిమితులు తీసుకొస్తూ చట్టం చేయాలని భావిస్తోంది మోడీ సర్కారు. అనవసర ఖర్చులతో చాలా డబ్బు వృధా చేస్తున్నారని.. పెళ్లిళ్ల వేడుకల మీద పరిమితులు విధించటం.. పరిమితి దాటిన వారిపై పన్ను పోటు వేయాలని భావిస్తున్నట్లుగా కమలనాథులు చెబుతున్నారు.

పెళ్లిళ్లను వైభవంగా చేసుకునే విషయంలో నిజంగానే ప్రజలు కష్టాలు పడుతున్నారా? లేదా? అన్నది ఓ పెద్ద చర్చే. ఎవరి కోసమో అప్పులు పాలయ్యేలా ఖర్చులు చేసే వాళ్లు ఉంటే ఉండొచ్చు. అలా అని అందరూ అలానే చేస్తారని అనుకోవటం తప్పే. సాదాసీదా జనాలకు జీవితంలో పెద్ద పెద్ద విషయాలంటే పెళ్లి చేసుకోవటం.. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకోవటం మీదనే ఉంటుంది. వారుసాధించే విజయాల్ని చూసి మురిసిపోవటం ఉంటుంది.

ఇలాంటి చిన్న చిన్న సంతోషాలకు పరిమితులు విధిస్తూ.. పన్ను పోట్లు విధించాలన్న చెత్త ఆలోచనల్ని చూస్తే.. కడుపు మండిపోక మానదు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తిరుమల పుణ్యక్షేత్రం మహా బిజీగా ఉంటుందన్న కారణంతో.. దేవుడ్ని దర్శించుకునే విషయంలో రేషన్ పెట్టాలని.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకోవాలన్న చెత్త రూల్ పెట్టాలన్న చర్చ కూడా సాగింది. అయితే.. అదేమీ వర్క్ వుట్ కాలేదనుకోండి.

ఇప్పుడు అదే తీరులో మోడీ సర్కారు.. పెళ్లి వేడుకల మీద పరిమితులు పెట్టాలన్న ఆలోచనలో ఉంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు కూడా. అంతా బాగానే ఉంది కానీ.. కోట్లాది మంది జనం మీద ఇలాంటి ఐడియాలు రుద్దే ముందు.. సొంత పార్టీ నేతల మీద ఇలాంటివి వేయొచ్చు కదా అన్నది ఒక వాదన. ఎందుకంటే.. తాజాగా బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు రావు సాహెబ్ ధాన్వే కుమారుడి పెళ్లి జరిగింది. పెళ్లికొడుకు తండ్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైతే.. పెళ్లికొడుకు స్వయానా బోకర్ణాన్ ఎమ్మెల్యే. ఇక.. పెళ్లికూతురు విషయానికి వస్తే..ప్రముఖ మరాఠా సంగీత కళాకారుడు రాజేశ్ సర్కటే కుమార్తె రేణు.

మరింతమంది ప్రముఖులతో కూడిన పెళ్లి వేడుక అంటే మాటలా? అందుకు తగ్గట్లే ఏర్పాట్లు జరిగాయి. ఈ పెళ్లికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మొదలుకొని.. పలువురు కేంద్ర..రాష్ట్ర మంత్రులతో పాటు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మొత్తంగా 30 వేల మందికి పైనే అతిధులు హాజరైనట్లు చెబుతున్నారు. పెళ్లి కోసం ఔరంగాబాద్ లో మధ్య యుగ కాలం నాటి ప్యాలెస్ సెట్టింగ్ వేసి మరీ.. పెళ్లి వేడుకను ధూంథాం అన్న రీతిలో నిర్వహించారు. పెళ్లి కోసం మొయిన్ రోడ్డును కూడా బ్లాక్ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రముఖుల పెళ్లి కావటంతో పోలీసులు దగ్గరుండి భద్రతా ఏర్పాట్లు నిర్వహించటమే కాదు.. డ్రోన్ల సాయాన్ని తీసుకున్నారు. పెళ్లిళ్ల వేడుకల మీద పరిమితులు పెట్టాలని భావిస్తున్న మోడీ సర్కారు.. ముందు పార్టీ నేతల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లపై పరిమితులు విధించిన తర్వాత దేశ ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అంతేకానీ.. తమ వారికి ఒకలా.. దేశ ప్రజలకు మరోలా ఆలోచించటం సరికాదు. ప్రముఖులకు సరదాలు చాలానే ఉంటాయి. కావాలంటే విదేశాలకు వెళ్లి కూడా పెళ్లిళ్లు చేసుకోగలరు. సామాన్యులకు అలా సాధ్యం కాదు కదా. అందుకే.. మనసులో వచ్చిన ప్రతి ఐడియాను రుద్దేయకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/