Begin typing your search above and press return to search.

మహమ్మారి పీడ విరగడయ్యే రోజు ఎప్పుడో చెప్పిన బిల్ గేట్స్

By:  Tupaki Desk   |   26 March 2021 5:30 AM GMT
మహమ్మారి పీడ విరగడయ్యే రోజు ఎప్పుడో చెప్పిన బిల్ గేట్స్
X
చిన్నా.. పెద్దా.. ధనిక.. పేద.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఆగమాగం చేస్తున్న కరోనా మహమ్మారి చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. కోట్లాది మంది ప్రాణాలు తీసిన ఈ మాయదారి వైరస్ తగ్గినట్లే తగ్గి.. మళ్లీ చెలరేగిపోవటం.. దాని బారిన పడుతున్న దేశాలు కిందామీదా పడుతున్నాయి. కరోనా కోరలతో చోటు చేసుకున్న గాయాలతో విలవిలలాడిన భారత్.. కొన్ని నెలలుగా కోలుకుంటున్న పరిస్థితి. హమ్మయ్య.. గండం నుంచి బయటపడ్డామన్న భావన కలిగినంతనే.. అదేమంత సులువు కాదన్న విషయాన్ని అర్థమయ్యేలా చేస్తోంది తాజాగా విరుచుకుపడుతున్న సెకండ్ వేవ్.

మొదటి వేవ్ కు మించిన వేగంతో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారితో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. చాప కింద నీరులా వ్యాపిస్తున్న కేసులు.. భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర.. పంజాబ్ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎంత దారుణంగా ఉందన్నది అర్థమవుతోంది. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివేళ.. కట్టడి చేయటంలో ఏ మాత్రం లోపం జరిగినా.. అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఇదంతాఒక ఎత్తు అయితే.. కరోనా మహమ్మారి పీడ గురించి కొన్ని సంవత్సరాల ముందే హెచ్చరించిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు చెందిన వీడియో ఆ మధ్యన వైరల్ కావటం తెలిసిందే. భవిష్యత్తును ఎంత కచ్ఛితంగా ఊహించారు? మరెంత బాగా అంచనా వేశారన్న భావన అందరిలోనూ కలిగింది. అలాంటి గేట్స్.. తాజాగా మహమ్మారి పీడ నుంచి ప్రపంచం బయటపడే రోజు ఎప్పుడు వస్తుందన్న విషయంపై తాజా అంచనా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే.. ఆయన సమాధానం విన్నంతనే కాసింత నిరాశ కలగటం ఖాయం. ఎందుకంటే..కరోనా పీడ నుంచి ప్రపంచం బయటపడటానికి పట్టే సమయం దూరంగా ఉండటమే దీనికి కారణం. గేట్స్ అంచనా ప్రకారం 2022 చివర్లో మళ్లీ పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు వస్తాయని చెప్పారు. వ్యాక్సిన్ రావటం శుభ పరిణామం అని చెప్పిన ఆయన.. జరిగిన.. జరుగుతున్న విషాద పరిస్థితి గురించి ఆయన స్పందించారు. అంటే.. దాదాపు సంవత్సరం తొమ్మిది నెలలు.. అంటే 21 నెలలు. అంత కాలమా? అన్న ఆందోళన కలగటం ఖాయం.