Begin typing your search above and press return to search.

స‌త్యా నాదెళ్ల సూప‌ర్ అంటున్న బిల్ గేట్స్‌

By:  Tupaki Desk   |   28 Sep 2017 10:43 AM GMT
స‌త్యా నాదెళ్ల సూప‌ర్ అంటున్న బిల్ గేట్స్‌
X
సాధార‌ణంగా బ‌హుళ‌జాతి సంస్థ‌ల అధినేత‌లు త‌మ సంస్థ‌ల‌కు సీఈఓలు - సీఎండీల‌ను నియ‌మించిన త‌ర్వాత వారిపై ఓ క‌న్నేసి ఉంచుతుంటారు. వారి ప‌నితీరుపై అంత ఈజీగా సంతృప్తి వ్య‌క్తం చేయ‌రు. కానీ తెలుగువాడైన మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య‌నాదెళ్ల ఈ అభిప్రాయానికి మార్చుకునేలా చేశారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ తో ప్ర‌శంస‌ల జ‌ల్లుకురిపించుకున్నాడు. మారుతున్న సాంకేతిక విజ్ఞానానికి అనుగుణంగా మైక్రోసాఫ్ట్‌ ను సత్య నాదెళ్ల పరుగులు పెట్టిస్తున్నారంటూ సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. టెక్నాలజీపరంగా క‌లిసి వ‌స్తున్న‌ ప్రతి అవకాశాన్నీ సత్య నాదెళ్ల సద్వినియోగం చేసుకున్నారని తద్వారా ఈ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్‌ కు తిరుగులేని స్థానాన్ని కల్పించారని ఆయన అన్నారు.

‘హిట్ రిఫ్రెష్’ పేరుతో నాదెళ్ల రాసిన పుస్తకానికి బిల్‌ గేట్స్ ముందుమాట రాశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే దానిపై తన ముద్ర వేయడానికి నాదెళ్ల ప్రయత్నించారని గతాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా కొత్త మార్గంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారని, ఫలితాలనూ సాధించారని బిల్‌ గేట్స్ అన్నారు. కేవలం విండో కేంద్రక మార్గానికే పరిమితం కాకుండా కొత్త బాటలో కూడా మైక్రోసాఫ్ట్ ముందుకు వెళ్లడానికి నాదెళ్ల నాయకత్వం ఎంతగానో దోహదం చేసిందని ఆయన తెలిపారు. నిరంతరం సంప్రదింపులు జరపడం, వినియోగదారుల అవసరాలు గుర్తించడం, పరిశోధకులు, కార్యనిర్వహక అధికారులతోనూ కొత్త ఆలోచనలపై చర్చలు జరపడం వంటి సాహసోపేత చర్యలను నాదెళ్ల తీసుకున్నారని గేట్స్ స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలపై కూడా సత్య నాదెళ్ల దృష్టి పెట్టడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనమన్నారు.

కాగా, బిల్‌ గేట్స్ - స్టీవ్‌ బామర్‌ పథంలో కాకుండా నాదెళ్ల తనదైన శైలిలో ముందుకెళ్లి ఒకప్పుడు అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశారు. ఆ విధంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ సంస్థ‌ మార్కెట్ వాటాను 250 బిలియన్ డాలర్లకు పెంచారు.