Begin typing your search above and press return to search.

అల‌ర్ట్ః బైకుల ధ‌ర‌లు పెరిగిపోతాయ్‌

By:  Tupaki Desk   |   26 March 2017 1:38 PM IST
అల‌ర్ట్ః బైకుల ధ‌ర‌లు పెరిగిపోతాయ్‌
X
అల‌ర్ట్. దేశంలో ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, కాలుష్య ఉద్గార నిబంధనలైన భారత్ స్టేజ్ (బీఎస్) -4 ప్రమాణాలకు మారేందుకు సంస్థలకు ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనుంది. దాదాపు అన్ని కార్ల కంపెనీలు ఇప్పటికే బీఎస్ 4 ప్రమాణాలను పాటిస్తున్నాయి. కానీ స్కూటర్లు - బైకులుతోపాటు వాణిజ్య వాహనాలను తయారు చేసే కంపెనీలు ఇంకా ఈ నిబంధనలను పాటించడం లేదు. గడువు ప్రకారంగా వచ్చేనెల నుంచి కొత్త నిబంధనలు పాటించాల్సి వస్తే సంస్థలు తమ వాహన మోడళ్ల రేటును 6-8 శాతం మేర పెంచే అవకాశం ఉందని ఏంజిల్ బ్రోకింగ్‌లో ఆటో విభాగ రిసెర్చ్ అనలిస్టు శ్రీకాంత్ అకోల్కర్ అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిణామ ప్రభావం ఆటో రంగంపై తటస్థంగానే ఉండనుందని ఆయన అంటున్నారు.

కాగా, మరో పది రోజుల్లో బీఎస్3 నిబంధనలకు కాలం చెల్లిపోయి.. బీఎస్ 4 నిబంధనలు అమలులోకి రానున్నాయి. కానీ, ఇప్పటికీ దేశంలోని 20 వేల వాహన డీలర్ల వద్ద బీఎస్ 3 ప్రమాణాలతో తయారు చేసిన 9 లక్షల వాహనాలు ఇంకా అమ్ముడుపోకుండా ఉన్నాయి. వాటన్నింటినీ నెలాఖరులోగా విక్రయించడం సాధ్యమయ్యే పనికాదు. ఈ నేపథ్యంలో మార్చి 31 గడువును పొడిగించకుంటే వాహన సంస్థలు, డీలర్లకు కోట్లాది రూపాయల నష్టం చేకూరడంతోపాటు ఆటో రంగంలోని ఉద్యోగులపై భారీ ప్రభావం పడే ప్రమాదం ఉందని ది ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏడీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. బీఎస్ -3 ప్రమాణాల నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిందీ అసోసియేషన్. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందోనని టూవీలర్ కంపెనీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/