Begin typing your search above and press return to search.

బీహార్ దొంగ‌ను ప‌ట్టించిన న‌య‌న‌తార‌!

By:  Tupaki Desk   |   24 Dec 2017 5:48 AM GMT
బీహార్ దొంగ‌ను ప‌ట్టించిన న‌య‌న‌తార‌!
X
ద‌క్షిణాదిన అగ్ర‌తార‌గా వెలుగుతున్న హీరోయిన్ల‌లో న‌య‌న‌తార ఒక‌రు. త‌ర‌గ‌ని అందాల‌తో అంత‌కంత‌కూ ఆక‌ట్టుకుంటున్న ఈ అందాల భామ పుణ్య‌మా అని బీహార్ కు చెందిన ఒక దొంగ దొరికిపోయాడు. త‌న ప్ర‌మేయం లేకుండా.. ప‌రోక్షంగా స‌ద‌రు దొంగ పోలీసుల‌కు దొరికిపోవ‌టానికి న‌య‌న‌తార కార‌ణం కావ‌టం విశేషం.

ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. బీహార్ లోని ద‌ర్భంగాకు చెందిన సంజ‌య్ కుమార్ అనే బీజేపీ నేత సెల్ ఫోన్‌ ను మొహ‌మ్మ‌ద్ హ‌సైన్ అనే దొంగ దొంగ‌లించాడు. త‌న సెల్ ఫోన్ పోయిన విష‌యాన్ని సంజ‌య్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కాల్ సిగ్న‌ల్స్ ఆధారంగా ఆ ఫోన్ ను అదే సిమ్ కార్డులో వాడుతున్నాడ‌న్న విష‌యాన్ని గుర్తించారు పోలీసులు. సెల్ దొంగ‌ను ప‌ట్టుకునేందుకు ద‌ర్భాంగ పోలీసులు కొత్త ఎత్తు వేశారు.

త‌మ స్టేష‌న్ లో ప‌ని చేసే ఏఎస్ ఐ మ‌ధుబాలాదేవిని రంగంలోకి దించారు. దొంగ‌కు ఫోన్ చేసి తియ్య‌టి మాట‌ల‌తో అత‌న్ని లైన్లో పెట్టారు. త‌న‌కు ఫోన్ చేసింది పోలీస్ అన్న అనుమానంతో మొద‌ట్లో సందేహ‌ప‌డినా.. మ‌ధుబాలాదేవి టాలెంట్ కు డంగైపోయాడు. నాలుగు రోజుల పాటు ఇరువురి మ‌ధ్య మాట‌లు న‌డిచాయి.

త‌న మాట‌ల‌తో న‌మ్మ‌కంగా ట్రాప్ చేసిన స‌ద‌రు పోలీసు అధికారిణి.. త‌న ఫోటో అంటూ న‌య‌న‌తార ఫోటోను పంపింది. అంతే.. ఆ ఫోటోను చూసి ఫ్లాట్ అయిపోయాడు అమాయ‌క‌పు దొంగ‌. న‌య‌న‌తార ద‌క్షిణాది వారికి సుప‌రిచితం కానీ ఉత్త‌రాది వారికి కాదు క‌దా. దీంతో.. న‌య‌న‌తార ఫోటోను చూసిన అత‌గాడు ఫుల్ ఫ్లాట్‌. ఫోన్లో త‌న‌తో మాట్లాడే పోలీసు అధికారిణిని క‌లిసేందుకు ఒప్పుకున్నాడు. చెప్పిన చోటికి.. చెప్పిన టైంకు వ‌చ్చిన దొంగ‌ను సివిల్ డ్రెస్ లో ఉన్న మ‌ధుబాలాదేవి అదుపులోకి తీసుకొని స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. సెల్ ఫోన్ ను రిక‌వ‌రీ చేశారు. ఇలా.. ఇక దొంగ పోలీసుల చేతికి దొర‌క‌టానికి న‌య‌న‌తార త‌న‌కు సంబంధం లేకుండానే పెద్ద హెల్ప్ చేశారు.