Begin typing your search above and press return to search.

ఆ వివాదం.. మంత్రి శాఖ మార్పు.. అలిగి మంత్రి రాజీనామా!

By:  Tupaki Desk   |   1 Sep 2022 4:58 AM GMT
ఆ వివాదం.. మంత్రి శాఖ మార్పు.. అలిగి మంత్రి రాజీనామా!
X
ఇటీవ‌ల బీజేపీకి గుడ్ బై చెప్పి లాలూప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్‌జేడీ)తో పొత్తు పెట్టుకుని మ‌రోమారు బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఒక‌ కిడ్నాప్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌జేడీ నేత, బీహార్ న్యాయ శాఖ మంత్రి కార్తీక్ కుమార్ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో జేడీయూ- ఆర్‌జేడీ సంకీర్ణ స‌ర్కారు అప్పుడే కుదుపుల‌కు లోనైంది. కార్తీక్‌ కుమార్‌ తన రాజీనామాను గవర్నర్‌కు పంపగా.. ఆయన ఆమోదించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

కాగా 2014లో జరిగిన ఓ కిడ్నాప్‌ కేసులో మంత్రి కార్తీక్ కుమార్ నిందితుడిగా ఉన్నారు. ఆయ‌న‌పై ప్ర‌స్తుతం ఆ కేసు న‌డుస్తోంది. అయితే ఇటీవ‌ల బీజేపీ పొత్తును కాల‌దన్నుకుని ఆర్‌జేడీతో మ‌రోమారు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్.. కార్తీక్ కుమార్ కు న్యాయ శాఖ మంత్రిగా ఎంచుకున్నారు.

దీనిపై ప్ర‌తిపక్ష బీజేపీ, లోక్ జ‌న‌శ‌క్తి పార్టీతోపాటు ఇత‌ర పార్టీలు భారీ ఎత్తున ఆందోళ‌న‌లు చేశాయి. కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్య‌క్తికి న్యాయ శాఖ మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌డం ఏమిట‌ని నిల‌దీశాయి.

ప్ర‌తిప‌క్షాల‌ నిరసనల నేపథ్యంలో కార్తీక్‌ కుమార్‌ను.. బీహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ న్యాయ శాఖ మంత్రిగా తప్పించి.. ఆయనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన చెరుకు మంత్రిత్వ‌ శాఖను అప్పగించారు. దీంతో అలిగిన‌ కార్తీక్‌ కుమార్‌ తన మంత్రి పదవికి ఆ ప‌ద‌విని చేప‌ట్టిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే రాజీనామా చేశారు. కార్తీక్‌ కుమార్‌ రాజీనామాతో.. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న‌ అలోక్‌ కుమార్‌ మెహతాకు చెరుకు శాఖ అదనపు బాధ్యతలు అ‍ప్పగించారు.

కార్తీక్ కుమార్ ప్ర‌స్తుతం ఆర్‌జేడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. బీహార్‌లో రాజ‌కీయంగా శ‌క్తివంత‌మైన అగ్ర కులం భూమిహార్ల‌కు చెందిన వ్య‌క్తి ఆయ‌న‌. దీంతో కొత్త‌గా ఏర్పాటైన నితీష్ కుమార్ మంత్రివ‌ర్గంలో కార్తీక్ కుమార్ కు ఆర్‌జేడీ అధినేత తేజ‌స్వీ యాద‌వ్ మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అయితే ఆదిలోనే హంస‌పాదులో ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

మ‌రోవైపు ఈ ప‌రిణామాల‌ను బీజేపీ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. జేడీయూ- ఆర్‌జేడీ సంకీర్ణ స‌ర్కారులో మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నివారు, ఆ కూట‌మిపై అసంతృప్తిగా ఉన్న‌వారిపై దృష్టి సారిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మ‌ను కాద‌నుకున్న నితీష్ కుమార్‌కు షాకివ్వాల‌నే ఆలోచ‌న‌లో బీజేపీ ఉన్న‌ట్టు స‌మాచారం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.