Begin typing your search above and press return to search.

తండ్రి కోసం 1200 కి.మీ. సైక్లింగ్.. ఆమె జీవితాన్ని మలుపు తిప్పనుందా?

By:  Tupaki Desk   |   22 May 2020 4:00 AM GMT
తండ్రి కోసం 1200 కి.మీ. సైక్లింగ్.. ఆమె జీవితాన్ని మలుపు తిప్పనుందా?
X
ఏం జరిగినా మన మంచికే అని కొందరనుకుంటారు. ఆ మాటను గుర్తుకు తెచ్చేలా ఉంటుందీ ఉదంతం. తండ్రిని విపరీతంగా అభిమానించే పదిహేనేళ్ల కుమార్తె చేసిన సాహసం.. దేశానికి అరుదైన ఆణిముత్యంగా మారనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తండ్రి కోసం సాహసం చేస్తే.. దేశానికి ఆణిముత్యం కావటమేందన్న సందేహం అక్కర్లేదు. విషయం మొత్తం తెలిస్తే.. మీరు సైతం ఇదే రీతిలో రియాక్టు కావటం ఖాయం.

లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో వలసకార్మికులు నిలిచిపోవటం తెలిసిందే. మాయదారి మహమ్మారి దెబ్బకు చోటు చేసుకున్న ప్రత్యేక పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నం చేయటం.. ఇందులో భాగంగా వందలాది కిలోమీటర్లు కాలినడక నడిచిన వైనం తెలిసిందే. తాజాగా అలాంటి సాహసమే చేసిన 15 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు సంచలనంగా మారింది.

బిహార్ లోని దర్భాంగాకు చెందిన పదిహేనేళ్ల అమ్మాయి జ్యోతి కుమారి. ఎనిమిదో తరగతి చదువుతోంది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఆమె కుటుంబం గుర్ గ్రామ్ కు చేరింది. తండ్రి ఆటో నడిపేటోడు. లాక్ డౌన్ తో పని లేకపోవటంతో ఆటో యజమాని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. లాక్ డౌన్ కు కాస్త ముందే ప్రమాదంలో మోహన్ ప్రమాదంలో గాయపడ్డాడు దీంతో.. మరే పని చేయలేని దుస్థితి. ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఇంటిని ఖాళీ చేయమని చెప్పటానికి ముందే తానే ఇంటిని ఖాళీ చేస్తే బాగుంటుందని భావించింది మోహన్ కుమార్తె జ్యోతి.

గుర్ గామ్ నుంచి తమ ఊరికి వెళ్లేందుకు ట్రక్కు డ్రైవర్ని అడిగితే రూ.6500 ఇస్తే వస్తానన్నాడు. కానీ.. వారి చేతిలో ఉన్నది రూ.600 మాత్రమే. దీంతో.. రూ.500తో పాత సైకిల్ ను కొన్న జ్యోతి.. తండ్రిని వెనక కూర్చోబెట్టుకొని మే 10న తన సైకిల్ ప్రయాణాన్ని షురూ చేసింది. రోజుకు తక్కువలో తక్కువ వంద నుంచి 150 కి.మీ. ప్రయాణించిన ఆమె 1200కి.మీ. దూరాన్ని ఈ నెల 18నాటికి పూర్తి చేసింది.

ఆమె చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వందలాది కిలోమీటర్లు.. అందునా వెనుక ఒకరిని కూర్చోబెట్టుకొని పదిహేనేళ్ల జ్యోతి చేసిన సాహసం.. పట్టుదలకు భారత సైక్లింగ్ సమాఖ్య అచ్చెరువొందింది. ఆమెతో మాట్లాడిన వారు.. ఆమెను ట్రయల్స్ కు రావాలని కోరింది. ఒకవేళ ఆమె కానీ తన సత్తా చాటితే.. సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామంటున్నారు. తండ్రిని తీసుకొని సొంతూరు వెళ్లే విషయంలో చూపిన తెగువ.. ట్రయల్స్ లో చూపిస్తే.. దేశానికి ఒక ఆణిముత్యం లభించినట్లేనని చెప్పక తప్పదు.