Begin typing your search above and press return to search.

బీహార్ లో ‘మొదటి దశ’ మొదలైంది

By:  Tupaki Desk   |   12 Oct 2015 4:03 AM GMT
బీహార్ లో ‘మొదటి దశ’ మొదలైంది
X
దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు.. మార్పులకు అవకాశం ఉంటుందని భావిస్తున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయి. మొత్తం 5 దశల్లో జరగనున్న ఎన్నికల్లో మొదటి దశ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు మొదలైంది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలి దశలో 49 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాలలో మధ్యాహ్నం మూడుగంటలకే.. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

49 స్థానాలకు మొత్తం అభ్యర్థులు 583 మంది బరిలోకి దిగారు. వీరిలో పురుషులు 529 మంది ఉండగా.. మహిళలు 54 మంది ఉన్నారు. ఈ 49 స్థానాల్లో అత్యధికంగా బీఎస్పీ 41 స్థానాల్లో పోటీ చేస్తోంది. తర్వాతి స్థానం బీజేపీదే. ఆ పార్టీ నేరుగా 27 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. సీపీఐ 25 చోట్ల.. జేడీయూ 24 చోట్ల.. ఆర్జేడీ 17 చోట్ల.. ఎల్జేపీ 13 చోట్ల.. సీపీఎం 12 చోట్ల.. కాంగ్రెస్ 8 స్థానాల్లో.. ఆర్ఎల్ ఎస్ పీ 6 స్థానాల్లో.. ఎన్సీపీ 6 స్థానాల్లో బరిలో ఉన్నారు. ఇక.. స్వతంత్ర అభ్యర్థులు 194 మంది బరిలో నిలిచారు.

49 స్థానాల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల నేర చరిత్ర చూస్తే.. అత్యధికంగా ఎన్జీయే కూటమి నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులే ఉండటం గమనార్హం. 23 మంది ఎన్డీయే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉండగా.. 18 మంది మహాకూటమి అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. ఇక.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో అత్యధికంగా కేసులు ఉన్న అభ్యర్థిగా జేడీయూ తరఫున మటిహనీ స్థానానికి పోటీ చేస్తున్న నరేంద్ర కుమార్ పై 15 కేసులు ఉండటం గమనార్హం.

బరిలో ఉన్న మొత్తం అభ్యర్థుల్లో కేవలం 37 మంది మీద మాత్రమే ఎలాంటి కేసులు లేవు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో పదో తరగతి కంటే తక్కువగా చదువుకున్న వారు నలుగురు కాగా.. పోటీ చేస్తున్న వారి సరాసరి వయసు 49 కాగా.. అత్యధికం 80గా ఉంది. ఇక..బరిలో ఉన్న అభ్యర్థుల్లో తమకు ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించిన అభ్యర్థులు బీజేపీకి చెందిన మృణాల్ శేఖర్.. ఎల్జేపీకి చెంది స్వీటీ హెంబ్రెంలు మాత్రమే ఉన్నారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ ముగిసి.. ఎన్నికల ఫలితాలు నవంబర్ 8న విడుదల కానున్నాయి.