Begin typing your search above and press return to search.

త్రేతాయుగంనాటి రాముడు సీత కేసుపై విచారణ!!

By:  Tupaki Desk   |   2 Feb 2016 5:07 AM GMT
త్రేతాయుగంనాటి రాముడు సీత కేసుపై విచారణ!!
X
అసలు జరిగిందో లేదో తెలీదు. ఎప్పటి కాలమో కూడా సరిగ్గా అంచనా వేసిందే లేదు. రాముడు.. సీత అన్న వాళ్లు అసలు పుట్టలేదని.. కేవలం కాల్పనికం అనే వారు ఎందరో.. ఆ దేవతామూర్తులు పుట్టారన్నది మరికొందరి వాదన. హిందూ పురాణాల్లో చెప్పే త్రేతాయుగానికి సంబంధించిన కాలం లెక్క ఏమిటో ఎవరికి తెలీదు. కానీ.. ఆ రోజుల్లో సీతారాముల మధ్య జరిగిన ఇష్యూ మీద కలియుగంలో కోర్టులో కేసు రూపంలో చర్చకు రావటం ఒక ఎత్తు అయితే.. దాని మీద కోర్టులో వాదనలు జరగటం మరో ఎత్తు.

ఎవరో అన్న మాటల్ని విని సీతను రాముడు అడవిలో వదిలేయటం ఏమిటి? దట్టమైన అడవిలో వదిలేస్తే.. ఆమె ఎలా ఉండగలదు? అంత క్రూరంగా సొంత భార్య పట్ల రాముడు ఎలా వ్యవహరించగలడు? ఏ తప్పూ చేయకుండానే సీతను రాముడు వదిలేయటం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు నలుగురి మధ్య చర్చగా కాకుండా.. బీహార్ లోని కోర్టులో కేసు రూపంలో నడిచింది. బీహార్ కు చెందిన ఠాకూర్ చందన్ కుమార్ అనే న్యాయవాది తనకు తాను పిటీషనర్ గా మారి.. త్రేతాయుగంలో రాముడు తన భార్య పట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

దీనికి సంబంధించిన విచారణ సోమవారం జరిగింది. ఈ పిటీషన్ ను స్వీకరించాలా? లేదా? అన్న అంశంపై వాదనలు జరిగాయి. దీనికి సంబంధించిన పిటీషనర్ ఠాకూర్ సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. సీతమ్మ బీహార్ రాష్ట్రంలోని మిథిలకు చెందిన అమ్మాయి అని.. అందువల్లే తాను ఇక్కడ కేసు వేసినట్లుగా పేర్కొన్నారు. తనకు ఏ మత విశ్వాసాల్ని కించపర్చటం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.

అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగిన ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఏంటి? పిర్యాదుకు మూలం ఏమిటి? సాక్ష్యం ఎవరు? అంటూ న్యాయమూర్తి ప్రశ్నలు వేశారు. దీనిపై సదరు న్యాయవాది తన వాదనను వినిపించారు. వీటిపై సంతృప్తిపడని న్యాయమూర్తి ఎప్పుడో త్రేతాయుగంలో చోటు చేసుకుందని చెప్పే రాముడు.. సీత వ్యవహారానికి సంబంధించిన దాఖలైన పిటీషన్ ను విచారించేందుకు నిరాకరించి పిటీషన్ ను కొట్టేశారు.