Begin typing your search above and press return to search.

సుదీర్ఘ భేటీ తర్వాత బిహార్ సీట్ల పంపకం ఒక కొలిక్కి

By:  Tupaki Desk   |   7 Oct 2020 11:15 AM IST
సుదీర్ఘ భేటీ తర్వాత బిహార్ సీట్ల పంపకం ఒక కొలిక్కి
X
దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న బిహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. అధికార ఎన్డీయే కూటమిలో కీలకమైన జేడీయూ.. బీజేపీ నేతల మధ్య తాజాగా సుదీర్ఘ భేటీ ఒకటి జరిగింది. గంటల పాటు సాగిన చర్చల అనంతరం.. సీట్ల లెక్కను ఒక కొలిక్కి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లో జేడీయూ 122 సీట్లలో పోటీ చేస్తుండగా.. బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేసేందుకు ఓకే చెప్పింది.

అయితే.. ఈ రెండు ప్రధాన పార్టీలు తమకు మిత్రపక్షమైన చెరో పార్టీకి తాము తీసుకున్న సీట్లలో కొన్ని స్థానాల్ని వారికి కేటాయించేలా ఒప్పందం చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జతిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామీ మోర్చాకు ఏడు స్థానాల్ని కేటాయించినట్లుగా జేడీయూ వెల్లడించింది. అదే సమయంలో బీజేపీ తనకు లభించిన 121 సీట్ల కోటాలో కొత్తగా కూటమిలోకి చేరిన ముకేశ్ సాహ్నికి చెందిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీకి కొన్ని సీట్లను కేటాయించనున్నారు.

అంతేకాదు.. ఇటీవల కాలంలో తరచూ చర్చకు వస్తున్న ముఖ్యమంత్రి పీఠం మీదన క్లారిటీతో మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంటే పరిస్థితి ఏమిటి? బీజేపీ అభ్యర్థిని సీఎం చేస్తారా? అన్న ప్రశ్నలకు బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ క్లారిటీ ఇస్తూ.. కాబోయే ముఖ్యమంత్రి నితీశ్ కుమారేనని తేల్చారు. మరీ మాట ఎన్నికలు పూర్తయి.. అంచనాలకు తగ్గట్లే ఎన్డీయే కూటమి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత కూడా ఉంటుందా? లేదా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంటుంది.