Begin typing your search above and press return to search.

బీహార్ పోరులో గెలిచేదెవరు? నిలిచేదెవరు?

By:  Tupaki Desk   |   25 Sept 2020 4:40 PM IST
బీహార్ పోరులో గెలిచేదెవరు? నిలిచేదెవరు?
X
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వేళైంది. ఉద్దండులైన కురువృద్ధులు అక్కడ పోటాపోటీగా తలపడుతున్నారు. కేంద్ర పెద్దల అండతో మరోసారి సీఎం పీఠాన్ని ఎక్కాలని ఒకరు తహతహలాడుతుండగా.. జైలు నుంచే వ్యూహాలు రచించి గెలుపు గుర్రాలను మరో నేత ఎంచుకుంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరుపక్షాల విజయావకాశాలు, స్థానిక పరిస్థితులపై సాక్షి ప్రత్యేక కథనం..

కరోనా క్లిష్ట సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాజకీయాల్లో ఆరితేరిన నేతలున్న బిహార్ లో.. కేంద్ర ఎన్నికలు సంఘం ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది. దేశంలోనే తలపండిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న పోటీ కావడంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

బీజేపీ-జేడీయూ-ఎల్.జే.పీ (లోక్ జన శక్తి పార్టీ) ఉమ్మడిగా బరిలోకి దిగుతుండగా.. గత మిత్రులు కాంగ్రెస్-ఆర్జేడీ మరోసారి జట్టుకట్టాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోవడంతో పాటు దాదాపు రెండు దశాబ్ధాల పాటు బిహార్ రాజకీయాలను ఏలిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం జైల్లో ఉండడం ఎన్డీయే కూటమికి కలిసొచ్చే అంశం.

ఇక నితీష్ కుమార్ పాలనపై ప్రజల్లో నమ్మకం, జాతీయ స్థాయిలో ఆయనుకున్న పలుకుబడితో పాటు బీజేపీ మద్దతు జేడీయూ మరింత బలం చేకూరుస్తోంది. లాలూ జైలు పాలవ్వడంతో పార్టీ బాధ్యతలను భుజానుకెత్తుకున్న తేజస్వి యాదవ్ గత లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యారు. లాలూ కుమారుల మధ్యలో గొడవలు కూడా పార్టీలో రచ్చ కెక్కడంతో పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది.

ఇక ఐదేళ్లలో నితీష్ చేసిన అభివృద్ధి, బీజేపీ ఉన్న సత్సంబంధాలు ఎన్డీఏ కూటమికి దోహదపడే అవకాశం ఉంది. అయితే కరోనా నేపథ్యంలో దిగజారిన ఆర్థిక పరిస్థితి.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం..నిరుద్యోగుల ఆక్రోశం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. లాక్డౌన్ తో కోట్ల మంది బీహారీ వలస కూలీలు నడిరోడ్డుపై పడ్డారు. అలాగే బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కూడా బీహార్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

ఇక బీజేపీ-జేడీయూ-ఎల్ జేపీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఎల్.జే.పీ నేత రాంవిలాస్ పాశ్వన్ నితీష్ పై పీకల్లోతు కోపంతో మండిపోతున్నారు.ఈ అసమ్మతి ఎన్నికల్లో నితీష్ కు కఠిన పరీక్షగా పేర్కొంటున్నారు.

మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం 73 స్థానాలున్న ఆర్జేడీ ప్రతిపక్షంలో కూర్చుంది. జేడీయూ(69), బీజేపీ (54), ఎల్.జే.పీ (2) మద్దతుతో నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతున్నారు.

గత ఎన్నికల్లో ఏళ్ల నాటి బంధాన్ని వదులుకొని నితీష్ తన చిరకాల శత్రువు లాలూ ప్రసాద్ యాదవ్ తో దోస్తీ కట్టారు. అయితే లాలూ కుమారులపై అవినీతి ఆరోపణలతో విభేదాలు తలెత్తి.. పడక బీజేపీతో జట్టుకట్టి నితీష్ కుమార్ ప్రభుత్వంను నడిపిస్తున్నారు. లాలూ ప్రసాద్ ప్రస్తుతం జైల్లో కట్టారు.

ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఓవైపు నితీష్ చాణక్యత.. బీజేపీ ప్రోద్బలం.. వృద్ధ నేత లాలూ వ్యూహాలు ఏమేరకు బీహార్ లో పనిచేస్తాయి..? ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది వేచిచూడాలి.