Begin typing your search above and press return to search.

హుజూర్ నగర్ లో బీజేపీకి ఘోర అవమానం

By:  Tupaki Desk   |   24 Oct 2019 7:36 AM GMT
హుజూర్ నగర్ లో బీజేపీకి ఘోర అవమానం
X
మహారాష్ట్ర, హర్యానాలోనే కాదు.. తెలంగాణలోనూ బీజేపీకి గట్టి దెబ్బే తగిలింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా చెలరేగిపోతున్న బీజేపీకి చుక్కలు చూపించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హుజూర్ నగర్ లో బీజేపీ దారుణ ఓటమిదిశగా పయనిస్తుండడం ఆ పార్టీకి ఘోర అవమానంగా మారింది.

బీజేపీకి హుజూర్ నగర్ పీడకలను మిగిల్చింది.. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ మొదటి స్థానంలో .. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా.. స్వతంత్ర హెల్మెట్ గుర్తు అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ 4వ స్థానానికి పడిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉండి మొన్నటి ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీకి ఇంతకంటే ఘోర అవమానం లేదని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.విశేషం ఏంటంటే కాంగ్రెస్ కు కంచుకోటలైన మట్టపల్లి, నేరేడు జర్ల మండలాల్లోనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.

దీన్ని బట్టి తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ మాత్రమేనని ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. కేంద్రం వరకే బీజేపీ పరిమితం అని తేల్చిచెప్పారు. అయితే హుజూర్ నగర్ ఫలితం చూసి తెలంగాణపై ఆపరేషన్ మొదలుపెట్టాలని భావించిన బీజేపీ ఇప్పుడు ఫలితాలతో షాక్ తిన్నది. మరి కమలదళం ఎలా ముందుకెళ్తుందన్నది వేచిచూడాలి.

హుజూర్ నగర్ విజయంతో కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఈసాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫలితాలపై స్పందిస్తారు. ఆయన కాంగ్రెస్, బీజేపీలను ఎలా చెడుగుడు ఆడుతాడనేది ఆసక్తిగా మారింది.

ఇక హుజూర్ నగర్ లో హెల్మెట్ గుర్తు కలిగిన స్వతంత్య్ర అభ్యర్థి కి 1400 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తర్వాత ఇదే అత్యధికం. బీజేపీ నాలుగో స్థానంలోకి దిగజారింది. ఆ పార్టీకి కనీసం 1400 ఓట్లకంటే తక్కువ రావడం షాక్ కు గురిచేసింది.దీంతో బీజేపీ అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి గెలిచినట్టుందని.. తనకు అంత తక్కువ ఓట్లు రావడం నమ్మశక్యంగా లేదని.. దీనిపై విచారణ జరపాలని కోరడం విశేషం.