Begin typing your search above and press return to search.

దేత్తడి హారిక తొలగింపు నిజం కాదట.. టీఎస్ టీడీసీ ఛైర్మన్ ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   10 March 2021 5:30 AM GMT
దేత్తడి హారిక తొలగింపు నిజం కాదట.. టీఎస్ టీడీసీ ఛైర్మన్ ఏం చెప్పారంటే?
X
తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారికను నియమిస్తున్న వార్తలు మంగళవారం నాటి దినపత్రికల్లో రావటం తెలిసిందే. మధ్యాహ్నం నాటికి మొయిన్ స్ట్రీమ్ మీడియా మొదలుకొని.. మిగిలిన మీడియాలు.. సోషల్ మీడియాలో ఆమె నియమకాన్ని నిలిపివేశారని.. టూరిజం వెబ్ సైట్ లో ఆమె ఫోటోను తొలగించినట్లుగా వార్తలు వచ్చాయి. టూరిజం శాఖ ఉన్నతాధికారులతో సంప్రదించకుండా దేత్తడి హారిక నియమకాన్ని జరపటం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవటం జరిగిందన్న ప్రచారం జరిగింది.

అయితే.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలంగాణ టూరిజం శాఖ మరో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దేత్తడి హారిక నియామకం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలీకుండా జరిగిందని.. దీనిపై మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లుగా చెప్పారు. కానీ.. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని... అవన్నీ ఉత్త పుకార్లు మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. మొయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు.. చానళ్లలోనూ దేత్తడి హారికను తొలగించినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

దేత్తడి హారిక తెలంగాణ ఆడబిడ్డ అని.. కరీంనగర్ వాస్తవ్యురాలని.. బిగ్ బాస్ ఫేమ్ గా.. యూట్యూబర్ గా ఆమెకు సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారన్నారు. ఆమె నియమకానికి సంబంధించిన వీడియోను 15 లక్షల మంది చూశారని.. తెలంగాణ బిడ్డగా ఆమెకున్న పాపులార్టీతో రాష్ట్ర టూరిజానికి క్రేజ్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అంబాసిడర్ గా నియమించినట్లు చెప్పారు. ఆమె పాల్గొనే కార్యక్రమాల వరకే కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చేలా అది కూడా టూరిజం శాఖనే చెల్లించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

కరోనా నేపథ్యంలో టూరిజం శాఖ భారీగా నష్టపోయిందని.. ఇలాంటి వేళ ప్రమోషన్ కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టలేమన్నారు. సినిమా స్టార్లు.. పెద్ద సెలబ్రిటీలు అయితే డబ్బులు ఎక్కువ పెట్టాలని.. ఈ పరిస్థితుల్లో మహేశ్ బాబును తెలంగాణ టూరిజం అంబాసిడర్ గా పెట్టుకొని కోట్లు ఇవ్వలేమన్న శ్రీనివాసగుప్తా.. అందుబాటులో ఉన్న వనరులతో తెలంగాణ బ్రాండ్ ఉంటుందనే ఆమెను అంబాసిడర్ గా నియమించినట్లుగా చెప్పారు. ఇది అందరూకలిసి తీసుకున్న నిర్ణయంగా ఆయన చెప్పారు. ఈ క్లారిటీపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధం లేని అంశంలో మహేశ్ బాబు ప్రస్తావన తేవటంలో అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను సంప్రదించి.. కోట్లు కావాలని డిమాండ్ చేస్తే ఇలాంటి మాటల్లో అర్థం ఉంటుందని.. దేత్తడి హారికను నియమించుకోవటం ఏమిటి? దానికి మహేశ్ బాబు లాంటి వాళ్లం భరించలేమని కామెంట్ చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గంగవ్వనో.. కనకవ్వనో.. మలావత్ పూర్ణనో కాకుండా హారిక ను నియమించటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తే.. తెలంగాణ లో ఉండే టాలీవుడ్ స్టార్లు తక్కువ పారితోషికం తీసుకొని ప్రకటన లు చేస్తే తప్పేమిటి? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దేత్తడి హారిక నియామకం ఏమో కానీ.. ఈ ఇష్యూ సంబంధం లేని అంశాల దిశగా వెళుతోంది.