Begin typing your search above and press return to search.

ఇవాళ తేనేటి విందు ఓకే.. ఎయిర్ పోర్టుకు వెళ్లి ఉండాల్సింది జగన్

By:  Tupaki Desk   |   25 Dec 2021 5:13 AM GMT
ఇవాళ తేనేటి విందు ఓకే.. ఎయిర్ పోర్టుకు వెళ్లి ఉండాల్సింది జగన్
X
ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆసక్తికర సన్నివేశానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఒక తెలుగువాడు.. అందునా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక కావటానికి మించిన గొప్ప ఇంకేం ఉంటుంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు కాస్తంత చొరవను ప్రదర్శించినా తప్పేం కాదు. కానీ.. అందుకు భిన్నంగా సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ గా జస్టిస్ ఎన్వీ రమణ ఎంపికైన ఇంత కాలానికి తొలిసారి తాను పుట్టిన రాష్ట్రానికి ఆ మాటకు వస్తే.. పుట్టిన గడ్డకు వచ్చిన పరిస్థితి. తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి ఉంటే బాగుండేది.

ఒకవేళ ఆయనకు కుదరని పక్షంలో.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలక మంత్రులు వెళ్లి ఆహ్వానిస్తే బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా ఉన్నతాధికారులు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. కారణాలు అందరికి తెలిసినవే. కానీ.. ఇలాంటి వాటి విషయాల్లో ఏదో అనుకొని ఆగే కన్నా.. ముందు అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం ఐదు గంటల వేళలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవార్ధం ఆయనకు తేనీటి విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు సైతం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి తన మంత్రుల్నిసీఎం జగన్ పరిచయం చేయనున్నారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. ఈ తేనీటి విందు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి ముందు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సాదరణంగా ఆహ్వానించి.. స్వాగతం పలికి ఉంటే మరింత బాగుండేదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

ఎవరు ఏ స్థాయికి చేరుకున్నా.. తాను పుట్టిన గడ్డకు వచ్చిన సందర్భంగా అమితమైన భావోద్వేగానికి గురవుతుంటారు. ప్రపంచమంతా కీర్తించనీ.. పుట్టిన ఊళ్లో వచ్చే గుర్తింపు వేరుగా ఉంటుంది. ఈ విషయంలో జస్టిస్ ఎన్వీ రమణ జరగాల్సింది జరగలేదన్న మాట వినిపిస్తోంది. కాకుంటే.. స్వాగత కార్యక్రమాల్ని భారీగా ఏర్పాటు చేయటం కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పాలి. ఈ రోజు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించటంతో మొదలయ్యే ప్రోగ్రాంలు నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ రోజు తేనీటి విందు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.