Begin typing your search above and press return to search.

జగన్ ఇమేజ్ కి అగ్ని పరీక్ష... ?

By:  Tupaki Desk   |   15 Nov 2021 1:30 PM GMT
జగన్ ఇమేజ్ కి అగ్ని పరీక్ష... ?
X
ఏపీ సీఎం గా జగన్ ఉన్నారు. ఆయన చుట్టూనే మొత్తం వైసీపీ రాజకీయాలు తిరుగుతాయి. ఆయన ఇమేజ్ అటు ప్రభుత్వానికి కానీ ఇటు పార్టీకి కానీ ప్రాణం. అలాంటి ఇమేజ్ డ్యామేజ్ అయితే అది కోలుకోలేని దెబ్బగానే ఉంటుంది. ఇక జగన్ సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన చెప్పిన దాని ప్రకారం పాత్రధారులతో పాటు తెరవెనక సూత్రధారులు పెద్దలే ఉన్నారని తెలుస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి సహా కీలకనేతల పేర్లు దస్తగిరి చెప్పినట్లుగా కూడా ఆయన స్టేట్మెంట్స్ చూస్తే అర్ధమవుతోంది.

ఇక్కడే జగన్ ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. నిజానికి దస్తగిరి ది వాంగ్మూలం మాత్రమే. సీబీఐ స్టేట్మెంట్ అఫీషియల్ గా అది కానే కాదు, కానీ అది చాలు టీడీపీ అగ్గిని రాజేయడానికి. దాంతో ఇపుడు టీడీపీ అదే పని చేస్తోంది. శ్రీకాకుళంతో మొదలుపెట్టి అనంతపురం దాకా ఉన్న పార్టీ లీడర్స్ అంతా కలసి ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావిస్తున్నారు. వారంతా కలసి జగన్ని ఇందులోకి లాగుతున్న్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య అయితే ఇంకాస్తా ముందుకెళ్ళి వివేకాను హత్య చేసింది ఎవరో జగన్ కి తెలుసు అని కూడా అంటున్నారు. ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వంటి వారు అయితే జగన్ తో పాటు విజయసాయిరెడ్డి ని కూడా ఇందులోకి లాగేస్తున్నారు.

మొత్తానికి చూస్తే ఏపీ రాజకీయాల్లో ఫ్రాక్షన్ కల్చర్ తీసుకువచ్చారు అంటూ ఇప్పటిదాకా ఆరోపిస్తూ వస్తున్న టీడీపీకి దస్తగిరి వాంగ్మూలం అందివచ్చిన అవకాశంగానే ఉంది. ఈ విషయంలో జగన్ కంప్లీట్ గా కార్నర్ అవుతున్నట్లుగానే ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలి అన్నది కూడా వైసీపీ నేతలకు అర్ధం కాని విషయమే. అయితే కడప జిల్లాకు చెందిన చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తమ మీద ఎల్లో మీడియా, టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని అంటున్నారు. సీబీఐ అధికారికంగా ఇంకా ఏదీ చెప్పలేదు కదా అన్నది ఆయన వాదనలా ఉంది. అయితే అంతవరకూ ఎవరైనా ఆగుతారా. ఏమీ లేని దాని మీదనే మసి పూసి మారేడు కాయ చేయడమే రాజకీయం అయినపుడు ఇలాంటి అవకాశం ఎవరూ వదులుకోరు.

ఇలాంటి ఆరోపణలే టీడీపీ నేతల మీద వస్తే వైసీపీ నేతలు ఊరుకుంటార అన్నది కూడా ఇక్కడ ఆలోచిందాలి కదా. మరో విషయం కూడా ఇక్కడ ఉంది. నాడు చంద్రబాబు అధికారంలో ఉండగా వివేకానందరెడ్డి హత్య జరిగింది. దాని మీద జగన్ సహా అందరూ కలసి బాబు మీదనే ఆరోపణలు చేశారు. ఇపుడు చూస్తే విచారణలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. దాంతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. రేపటి రోజున సీబీఐ దీని మీద అధికారికంగా ఇదే విషయం చెబితే అపుడు వైసీపీ నేతలు ఏమంటారు అన్నది కూడా చూడాలి. మొత్తానికి జగన్ ఇమేజ్ కి ఒక విధంగా అగ్ని పరీక్ష పెట్టేలాగానే దస్తగిరి వాంగ్మూలం ఉందని మాత్రం అంటున్నారు.