Begin typing your search above and press return to search.

ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న హైదరాబాద్ పోలీసులకు వాడు దొరకటం లేదెందుకు?

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:15 AM GMT
ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న  హైదరాబాద్ పోలీసులకు వాడు దొరకటం లేదెందుకు?
X
చాక్లెట్ ఇస్తానన్న ఆశ చూపి.. ఆరేళ్ల పసిమెగ్గను దారుణంగా హత్యాచారం చేసిన రాజు కోసం హైదరాబాద్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. అంతేకాదు.. అతడ్ని పట్టిస్తే రూ.10లక్షల రివార్డు ఇస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ.. అతడి ఆచూకీ లభించటం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ అతడ్ని పట్టుకునేందుకు ఏర్పాటు చేస్తున్న టీంల సంఖ్య పెరుగుతున్నప్పటికి.. అతడి ఆచూకీ మాత్రం లభించటం లేదు.

రాజకీయ నేతలు.. సినీ తారలు మొదలు అన్ని వర్గాల నుంచి ఈ కసాయిని పట్టుకోవాలని.. కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. సీసీ కెమేరాలకు చిక్కిన ఇతగాడు.. పోలీసుల చేతికి మాత్రం చిక్కని పరిస్థితి. ఇంతకీ అతన్ని పట్టుకోవటంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారు? కరుడుగట్టిన నేరస్తుల్ని సైతం సులువుగా పట్టుకునే ట్రాక్ రికార్డు ఉన్న హైదరాబాద్ పోలీసులకు.. ఈ రాక్షసుడు కొరకరాని కొయ్యలా ఎందుకు మారాడు? అన్నదిప్పుడు ప్రశ్నలా మారాడు.

ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన రోజున తాను పని చేసే చోటుకు వెళ్లి మేస్తి నుంచి రూ.1800 తీసుకున్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. మొత్తంగా అతని దగ్గర రూ.2వేలకు మించి డబ్బుల్లేవని పోలీసులు చెబుతున్నారు. అంత తక్కువ మొత్తంతో ఎక్కువ దూరం ప్రయాణించే వీల్లేదని.. ఎక్కువ రోజులు రహస్యంగా గడిపే అవకాశం లేదని చెబుతున్నారు. అంత తక్కువ సొమ్ముతో ఎక్కువ దూరం ప్రయాణించే వీల్లేదని.. తప్పనిసరిగా.. హైదరాబాద్ లోనే ఉండి ఉండొచ్చన్న అంచనా వినిపిస్తోంది. నగర పరిసరాల్లోనే అతను తలదాచుకొని ఉండొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. అతడి కోసం ఇప్పుడు వందలాది పోలీసులు వెతుకుతున్న పరిస్థితి.

నేరస్తుడు కొత్తవాడు కావటం.. అతడికి సంబంధించిన ఆధారాలు తక్కువగా ఉండటం.. అతడి దగ్గర మొబైల్ ఫోన్ లేకపోవటంతో అతన్ని గుర్తించటం ఇప్పుడు సమస్యగా మారిందని చెబుతున్నాడు. హత్యాచారం చేసిన రోజు ఉదయం మాదన్న పేటలోని భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లిన వాడు.. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేసి తన గదికి తిరిగి వచ్చాడు.

సాయంత్రం 4.30-5 గంటల మధ్యలో చిన్నారికి మాయమాటలు చెప్పి తన రూమ్ కు తీసుకొచ్చి హత్యాచారానికి పాల్పడ్డాడు. బాధతో అరుస్తుంటే.. గొంతు నులిమి చంపేసి.. గదికి తాళం వేసి బయటకు వచ్చిన రాజు తాగిన మైకంలో అదే ప్రాంతంలో తిరిగాడు. సాయంత్రం ఏడు గంటలకు స్థానికంగా ఉన్న పానీపూరి బండి వద్ద పానీ పూరి తిన్నాడు. అప్పటికే సింగరేణి వాసులంతా పాప కోసం వెతుకుతున్నారు. రాత్రి తొమ్మిది గంటల వేళలో.. చిన్నారి నానమ్మను పలుకరించిన రాజు.. ‘పాప కనిపించిందా?’ అని ప్రశ్నించటం గమనార్హం.

తాగిన మత్తులో రోడ్డు మీద వెళుతున్న అతను అలా అడగటంతో పాప నానమ్మకు అనుమానం వచ్చి ఇంట్లో వారికి చెప్పింది. దీంతో.. పాప చెవికి ఉన్న బంగారు దుద్దుల కోసం తమ కుమార్తెను తీసుకెళ్లి ఉంటారని అనుమానించి.. స్థానికులకు వారు చెప్పటం.. తన మీద అనుమానం వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన రాజు అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా జారుకున్నాడు. స్థానికుల సాయంతోకుటుంబ సభ్యులు రాజు ఉండే గది వద్దకు వెళ్లారు. తాళం వేసి ఉండటంతో.. దాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి పన్నెండు గంటల సమయంలో మళ్లీ అనుమానం వచ్చి.. రాజు గది తాళం బద్ధలు కొడితే..పాప శవంగా కనిపించింది.

తొమ్మిది గంటల సమయంలోనే రాజు ఇంటి తాళం బద్ధలు కొట్టి ఉంటే.. నిందితుడ్ని అదుపులోకి తీసుకునే చక్కటి అవకాశాన్ని పోలీసులు చేజార్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది. పాపను చంపేసిన అనంతరం మేస్త్రీ వద్దకు వెళ్లి డబ్బులు తీసుకున్న రాజు.. అనంతరం స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లుగా చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత సంతోష్ నగర్.. ఉప్పల్.. మాదన్నపేట పరిసరాల్లో సంచరించి.. అనంతరం పాతబస్తీ వైపు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ రాక్షసుడు నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులకు పెను సవాల్ గా మారారని చెప్పక తప్పదు.