Begin typing your search above and press return to search.

అతి చేసిన యాడ్ కు.. అదిరే ట్విస్టు.. జొమాటోకు భారీ షాక్

By:  Tupaki Desk   |   1 Sept 2021 8:00 AM IST
అతి చేసిన యాడ్ కు.. అదిరే ట్విస్టు.. జొమాటోకు భారీ షాక్
X
ఒక్కోసారి అంతే. ఏదో అనుకొని.. భారీ అంచనాలతో బ్లాక్ బస్టర్ ఖాయం అనుకుంటారు. కానీ.. తీరా చూస్తే.. డిజిస్టార్ అవుతుంది. తాజాగా జొమాటో విడుదల చేసిన రెండు యాడ్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. తమ కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని చెప్పేందుకు వీలుగా వారు విడుదల చేసిన ప్రకటనలు.. ఏ మాత్రం సాయం చేయకపోగా.. కంపెనీకి నెగిటివ్ టాక్ తీసుకొచ్చాయి. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాయి. హృతిక్‌.. కత్రినా కైఫ్ లాంటి స్టార్లతో చేసిన యాడ్ తో భారీ మైలేజీ ఖాయమని భావిస్తే అందుకు భిన్నంగా వచ్చిన స్పందన.. ఆ సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

జొమాటో సంస్థ తాజాగా రెండు వేర్వేరు ప్రకటనల్ని విడుదల చేసింది. అందులో ఒకదానిని హృతిక్‌ చేస్తే.. మరొక ప్రకటనను కత్రినాకైఫ్ చేసింది. మొదటి ప్రకటనలో డోర్ బెల్ కొట్టిన జొమాటో బాయ్ కు.. తన ఎదురుగా హృతిక్‌ రోషన్ రావటం.. సర్ ప్రైజ్ కావటం ఒక ఎత్తు అయితే.. 'జాదూ' అంటూ పొగడటంతో సదరు బాయ్ ఆశ్చర్యపోతాడు. అంత పెద్ద స్టార్ తనను పొగడటం ఏమిటని చూస్తుంటే.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా మీరు టైంకు డెలివరీ చేస్తారని చెప్పటమే కాదు.. నీతో సెల్ఫీ దిగుతానంటూ ఫోన్ కోసం లోపలకు వెళతాడు.

హృతిక్‌ లాంటి స్టార్ తనను పొగడటమే కాదు.. సెల్ఫీ కోసం అడగటంతో సంతోషపడిపోతాడు. అంతలో.. అతని ఫోన్ రింగ్ అలెర్టు రావటం.. తర్వాత ఆర్డర్ డెలివరీ చేయాలన్న మెసేజ్ వస్తుంది. దీంతో.. హృతిక్‌ తో సెల్పీ కంటే.. తర్వాతి డెలివరీని టైంకు ఇవ్వాలన్న ఉద్దేశంతో వెంటనే బయలుదేరుతాడు. మరో యాడ్ లో.. డెలివరీ బాయ్ బెల్ కొడితే.. కత్రినా కైఫ్ బయటకు రావటం..అతని టైమింగ్ ను మెచ్చుకోవటం.. కాస్త తిని వెళుదువంటూ.. ఇంట్లో నుంచి కేక్ తీసుకొచ్చేస్తున్న వేళ.. మరో ఆర్డర్ కోసం అలెర్టు రావటంతో.. సదరు బాయ్ వెళ్లిపోతాడు.

తమకు అందరు కస్టమర్లు స్టార్లే అంటూ ఒక మాట చెప్పటం ద్వారా.. తమ కమిట్ మెంట్ ను ప్రదర్శించాలని భావించింది జొమాటో. అయితే.. ఈ ప్రకటనలకు నెటిజన్ల స్పందన మరోలా ఉంది. అంత పెద్ద స్టార్లతో సెల్ఫీలు దిగటానికి కూడా టైం ఇవ్వరా? ఉద్యోగుల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ రివర్సులో విరుచుకుపడుతున్నారు. 'మీకు అలా అర్థమైందా?' అన్నట్లుగా నెటిజన్ల స్పందనపై జొమాటో వివరణ ఇస్తూ.. తమ ప్రకటనల్ని కొందరు అపార్థం చేసుకుంటున్నారని ప్రకటన విడుదల చేసింది.డెలివరీ ఉద్యోగి గౌరవాన్ని పెంచటమే తమ లక్ష్యమని పేర్కొంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ.. ఇవేమీ నెటిజన్లను కన్వీన్స్ చేయలేకపోతున్నాయి. మనలో మనమాట.. ఇప్పుడు నడుస్తున్నకరోనా సీజన్ లో.. ఒక మోస్తరు ఇళ్లు.. అపార్ట్ మెంట్ల లోకే డెలివరీ బాయిస్ కు ఎంట్రీ ఇవ్వట్లేదు. అలాంటిది హృతిక్‌.. కత్రినా లాంటి వారి ఇళ్లకు నేరుగా వెళ్లిపోయే సీన్ ఉంటుందంటారా?