Begin typing your search above and press return to search.

అమెరికా గ్రీన్ కార్డు కావాలనుకునే వారికి గట్టి షాక్

By:  Tupaki Desk   |   22 Sept 2021 4:00 PM IST
అమెరికా గ్రీన్ కార్డు కావాలనుకునే వారికి గట్టి షాక్
X
అమెరికా వెళ్లి చదువుకోవాలని.. అక్కడే స్థిరపడాలని చాలా మందికి ఆరాటం ఉంటుంది. కానీ ఆ దేశంలో ఉండడానికి అనేక నిబంధనలు విధించారు. ముఖ్యంగా అమెరికాలో జీవించాలంటే గ్రీన్ కార్డు తప్పనిసరి . అమెరికాలో విదేశీయులకు గ్రీన్ కార్డు ఉంటేనే అక్కడి పౌరుడిగా గుర్తిస్తుందీ ఆ దేశం. వివిధ దేశాల నుంచి వెళ్లిన వారు శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు తీసుకుని స్థిరపడ్డారు. ఇండియా నుంచి కూడా అనేక మంది అమెరికా వెళ్లి స్థిరపడిన వారు ఎందరో ఉన్నారు. అయితే గ్రీన్ కార్డు పొందాలంటే ఎంతో ప్రయాస ఉండేది. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు పొందేందుకు ఒక ఫీజును నిర్ణయించి ఆమోదం పొందించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ బిల్లు అమెరికా సెనెట్ లో వీగిపోయింది.

యుఎస్‌లోని భారతీయులకు పెద్ద షాక్ తగిలింది. ‘సూపర్ ఫీజు’తో గ్రీన్ కార్డు పొందాలనుకునే విదేశీ నిపుణులకు నిరాశ కలిగింది. జోబైడెన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు వీగిపోయింది. తాజాగా సెనేట్ పార్లమెంట్ లో 'సూపర్ ఫీజు' చెల్లించి యుఎస్ గ్రీన్ కార్డ్ పొందాలనే ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.

ఇంతకుముందు డెమొక్రాట్లు $ 3.5 ట్రిలియన్ వ్యయ బిల్లులో భాగంగా 8 మిలియన్ గ్రీన్ కార్డులను జారీ చేయాలని ప్రణాళిక వేశారు. ఈ బిల్లు ఆమోదించబడితే కుటుంబ ఆధారిత వలసదారుడు ఒక అెరికా పౌరుడు స్పాన్సర్ చేస్తే.. రెండేళ్లుగా అమెరికాలో ఉంటున్న వారు 'సూపర్ ఫీజు' కింద 2500 డాలర్లు చెల్లించి గ్రీన్ కార్డ్‌ను పొందవచ్చు.

ఎప్పటి నుంచో ఉంటున్న వారు 1500 డాలర్లు 'సూపర్ ఫీజు' చెల్లించడం ద్వారా గ్రీన్ కార్డును పొందవచ్చు. అయితే ఈ బిల్లును అధికార డెమోక్రాట్లు ప్రవేశపెట్టగా సెనేట్ పార్లమెంటేరియన్ ఎలిజబెత్ మెక్‌డొనౌ ఈ బిల్లు వ్యయ బిల్లులో ఏమి ఉండాలనే కఠినమైన నియమాలకు అనుగుణంగా లేదని వ్యతిరేకించారు. బిల్లుకు సెనెట్ వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.

"ఈ నిర్ణయంతో మేము తీవ్రంగా నిరాశ చెందాము కానీ బడ్జెట్ సయోధ్యలో వలసదారులకు చట్టబద్ధమైన హోదా కల్పించే పోరాటం కొనసాగుతోంది" అని సెనేట్ మెజారిటీ నాయకుడు చార్లెస్ షుమెర్ చెప్పుకొచ్చారు. దీంతో అమెరికాలో స్థిర నివాసం కోసం చూస్తూ గ్రీన్ కార్డ్ ఆశిస్తున్న భారతీయులు సహా విదేశీ వలసదారులకు గట్టి షాక్ తగిలింది.