Begin typing your search above and press return to search.

మంత్రులు ఔట్.... సీనియర్లు ఫట్... !

By:  Tupaki Desk   |   8 Dec 2018 7:05 AM GMT
మంత్రులు ఔట్.... సీనియర్లు ఫట్... !
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలే వెల్లడి కావాల్సి ఉంది. సర్వేల పేరుతో ఒక్కొక్కరు ఒక్కో హంగామా చేయడమూ ప్రారంభమైంది. ఈ సారి ఎన్నికల్లో ఉత్తరాది, దక్షిణాది అంటూ సర్వేలు కూడా కొత్త పుంతలు తొక్కడం విశేషం. ఉత్తరాది టీవీ ఛానెల్స్ తమ సర్వేలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కడితే.... ఆంధ్రప్రదేశ్ లోని సీనియర్ రాజకీయ నాయకుడు, సర్వే మాంత్రికుడు లగడపాటి రాజగోపాల్ మాత్రం అధికార మార్పిడి తప్పని సరి అంటున్నారు.

ఈ ఎన్నికల్లో ప్రజా కూటమిదే విజయమని ఆయన ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్ధులు ఎక్కువ మంది గెలుస్తారని లగడపాటి తన సర్వేలో వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర అంశాలు కూడా వెలుగులోకి వస్తాయని లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. కొందరు ప్రముఖులు ఓటమి పాలు కావడం ఖాయమని ఆయన సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. సర్వేలను కాసేపు పక్కన పెడితే.... ఈ ఎన్నికలు మాత్రం కొన్ని చేదు నిజాలను వెల్లడించడం ఖాయంగానే కనిపిస్తోంది. దీని కి ఓటింగ్ సరళి కూడా ఇతోధికంగా సాయపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మంత్రులు కొందరు ఓటమి పాలు కావడం ఖాయంగానే కనిపిస్తోంది. వారితో పాటు పార్టీ సీనియర్లలో కొందరు కూడా ఓటమి పాలవుతారని విశ్లేషకులు అంటున్నారు. నగరానికి చెందిన మంత్రులలో ఒకరు ఓటమి పాలవుతారని, దీనికి కారణం ఆయన పార్టీ మారి మంత్రి కావడమేనని వార్తలొస్తున్నాయి. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఒకరు ఎంతో ప్రయత్నాలు చేసారని, అయినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖమ్మంలో పర్యటించడంతో ఆయన కూడా ఓడిపోవడం ఖాయమని అంటున్నారు.

ఇక కరీంనగర్‌- అదిలాబాద్- నిజామాబాద్- వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు విజయావశాశాలు లేవని తెలుస్తోంది. ఇక మహాకూటమి గా ఏర్పడిన కాంగ్రెస్- తెలుగుదేశం- తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు కూడా పరాజయం పాలవుతారని విశ్లేేషకులు అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నాయకులకు ఓటమి తప్పదని అంటున్నారు. వీరిలో నల్లగొండ- వరంగల్ జిల్లాలకు చెందిన సీనియర్లు ఉన్నారని సమాచారం. మొత్తానికి తెలంగాణ ముందస్తు ఎన్నికలు రాజకీయ నాయకులకు కొత్త పాఠాలు నేర్పడం ఖాయంగానే ఉంది.