Begin typing your search above and press return to search.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు సారూ.. రెండున్న‌రేళ్లు అయిపోయిందిగా!

By:  Tupaki Desk   |   10 Dec 2021 4:37 AM GMT
మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు సారూ.. రెండున్న‌రేళ్లు అయిపోయిందిగా!
X
మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌-ఏపీలో ఇప్పుడు ఇదో పెద్ద హాట్ టాపిక్‌. ముఖ్యంగా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలోను.. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌లోనూ.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణపై హాట్ హాట్ చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. 2019లో అనూహ్య విజ‌యం అందుకున్న వైసీపీ నాయ‌కుడు.. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌.. త‌న మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకునే క్ర‌మంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న మంత్రివ‌ర్గంలో సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్క‌డెక్క‌డో ఉన్న వారిని తీసుకువ‌చ్చి.. త‌న కేబినెట్‌లో కూర్చోబెట్టుకున్నారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్‌గా ఉన్న రోజా.. ఆళ్ల రామ‌కృష్నారెడ్డి, భూమన కరుణాక‌ర‌రెడ్డి.. ఇలా చాలా మంది రెడ్డి నేత‌లు షాక్ అయ్యారు.

అదేస‌మ‌యంలో ఇత‌ర సామాజిక‌వ ర్గాల్లోని వారు..కూడా ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి రావాల‌ని.. ముఖ్యమంత్రిగా జ‌గ‌న్‌ను చూడాల‌ని క‌ల‌లు క‌న్న‌.. ఆయ‌న కోసం.. శ్ర‌మించిన నాయ‌కులు.. మంత్రి వ‌ర్గంలో చోటు కోసం.. ఎదురు చూశారు. అయితే.. అప్ప‌ట్లో సోషల్ ఇంజ‌నీరింగ్ పేరుతో.. ఊహించ‌నివారికి కూడా జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు అప్ప‌గించారు. అయితే.. అంద‌రినీ తాను సంతృప్తి ప‌రుస్తాన‌ని.. ఈ మంత్రివ‌ర్గాన్ని రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. మారుస్తాన‌ని.. అంతేకాదు.. మొత్తం మంత్రి వ‌ర్గంలో 90 శాతం మందిని మార్చి.. అంద‌రికీ అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని ..కూడా అప్ప‌ట్లో హామీ ఇచ్చారు.

దీంతో మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌నివారు.. మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ఆశ‌లు పెట్టుకున్న‌వారు.. ఎప్పుడెప్పుడు..రెండున్న‌రేళ్లు గ‌డుస్తాయా..అని కేలండ‌ర్‌ను తిప్పుకొంటూ..కూర్చున్నారు. తీరా..ఇప్పుడు రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. ఈ నెల 7వ తేదీకి ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డి రెండున్న‌ర సంవ‌త్సాలు పూర్త‌యింది. దీంతో మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని.. త‌మ‌కు సీటు ల‌భిస్తుంద‌ని.. చాలా మంది నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు కూడా రాలేదు. నిజానికి దీనిపై నిత్యం చ‌ర్చ లు జ‌రుగుతున్నాయ‌నే సంకేతాలు కొన్నాళ్లుగా వినిపించాయి.

అయితే.. ఇటీవ‌ల కాలంలో మాత్రం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యం.. ఎక్క‌డా ప్ర‌భుత్వంలో చ‌ర్చ‌కు రావ‌డం లేదు. మ‌రి దీనిని బ‌ట్టి అస‌లు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుందా? అంద‌రినీ సంతృప్తి ప‌రుస్తాన‌న్న జ‌గ‌న్ హామీ నెర‌వేరుతుందా? అనే విష‌యంపై పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి .. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ స్వ‌యంగా ఇద్ద‌రికి మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. వారిలో మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి, చిల‌కలూరి పేట నుంచి టికెట్ కూడా త్యాగం చేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఉన్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఈ ఊసు ఎత్త‌క పోవ‌డం.. వీరంతా తీవ్ర నిరాశ‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో మంత్రి వ‌ర్గాన్ని మార్చే సాహ‌సం చేయ‌లేర‌నే సంకేతాలు మ‌రోవైపు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.