Begin typing your search above and press return to search.

బిగ్ ఎల‌క్ష‌న్ బీజేపీ.. స్మాల్ ఎల‌క్ష‌న్ కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   20 April 2022 7:30 AM GMT
బిగ్ ఎల‌క్ష‌న్ బీజేపీ.. స్మాల్ ఎల‌క్ష‌న్ కాంగ్రెస్‌
X
దేశంలో ఎన్నిక‌ల చిత్రాలు.. ఫ‌లితాలు విచిత్రంగా ఉంటాయి. ఒకే ప్రాంతంలో జ‌రిగే వివిధ ఎన్నిక‌ల్లో ఓటర్ల తీర్పు మారుతూనే ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓ పార్టీకి ఓటు వేసే ప్ర‌జ‌లు.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మాత్రం మరో పార్టీ వైపు మొగ్గు చూపుతున్న ఉదంతాలు ఇటీవ‌ల ఎక్కువ‌య్యాయి.

ప్ర‌స్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల‌తో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీల ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ పూర్తి మెజారిటీ వ‌స్తుంది.. కానీ వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మాత్రం దెబ్బ‌తింటోంది.

ఇటీవ‌ల నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, ఒక లోక్‌స‌భ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేక‌పోయింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌హారాష్ట్ర, బిహార్‌ల‌లోని ఒక్క అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి, ప‌శ్చిమ బెంగాల్‌లోని ఒక అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప‌శ్చిమ బెంగాల్‌లో రెండు స్థానాల్లోనూ అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ గెలిచింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ విజ‌యం సాధించింది. బిహార్‌లో ఆర్జేడీ అభ్య‌ర్థి గెలిచారు.

ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి రాజా సింగ్ ఒక్క‌రే ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా రాష్ట్రం నుంచి న‌లుగురు బీజేపీ ఎంపీలు విజ‌య ఢంకా మోగించారు. కానీ స్థానిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఆశించిన ఫ‌లితాలు రాలేదు. మ‌ళ్లీ దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పార్టీ పుంజుకుంది. దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్ రావు, హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ త‌మ సొంత పేరుతో గెలిచిన‌ప్ప‌టికీ విజ‌యం బీజేపీ ఖాతాలోనే చేరుతుంది. ఈ నేప‌థ్యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లతో పాటే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగితే దెబ్బ ప‌డే అవ‌కాశం ఉంద‌ని అన్ని పార్టీలో ఆలోచిస్తున్నాయ‌ని టాక్‌.

2018లో కేసీఆర్ అలా అనుకునే ముంద‌స్తుకు వెళ్లి రెండోసారి అధికారంలోకి వ‌చ్చారు. ఇటీవ‌ల యూపీలో వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ విజ‌యం సాధించ‌గ‌లిగింది. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కంటే ఆరు నెల‌ల ముందే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగితే మేల‌ని భావిస్తున్నాయి. మ‌రోవైపు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచింది కాబ‌ట్టి ఇత‌ర ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ స‌హా మిగ‌తా పార్టీలు గెలిచినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అందుకే దేశంలో బిగ్ ఎల‌క్ష‌న్స్‌లో బీజేపీ.. స్మాల్ ఎల‌క్ష‌న్స్లో కాంగ్రెస్‌, ఇత‌ర ప్రాంతీయ పార్టీల జోరు క‌నిపిస్తుంద‌ని నిపుణులు అంటున్నారు. మ‌రి బీజేపీని ఓడించ‌డం కోసం చేతులు క‌లిపే ప్ర‌య‌త్నాలు చేస్తున్న కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేస్తాయో చూడాలి.