Begin typing your search above and press return to search.

రూ.25 కోట్లకు టోపీ: కంపెనీ పేరుకు.. దాని ఎదవ పనులకు పోలికే ఉండదు

By:  Tupaki Desk   |   18 July 2021 4:40 PM IST
రూ.25 కోట్లకు టోపీ: కంపెనీ పేరుకు.. దాని ఎదవ పనులకు పోలికే ఉండదు
X
పేరుకు.. చేసే పనులకు ఏ మాత్రం పోలిక లేని తీరు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. రాముడన్న పేరు పెట్టుకున్నంతనే మంచి బాలుడు అయ్యే ఛాన్సు ఎలా ఉండదో.. కంపెనీ పేరుకు..దాని చేసే ఎదవ వేషాలకు ఏ మాత్రం పోలిక ఉండదన్న విషయాన్ని తాజాగా ఒక కంపెనీ చేసిన మోసం గురించి తెలిసిన అధికారులే నోరెళ్లబెడుతున్నారు. సదరు కంపెనీ చేసిన పనులతో ఏకంగా రూ.25 కోట్ల భారీ మొత్తాన్ని ఎగ్గొట్టిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

తాజాగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఒక భారీ కుంభకోణాన్ని బద్ధలు చేశారు. గుర్ గ్రామ్ కు చెందిన బిగ్ బాయ్ టాయ్స్ కంపెనీ చేసిన మోసం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ కంపెనీ సీఈవో నిపున్ మిగ్లానీ.. దుబాయ్ కు చెందిన లిఖాయత్ బఛూ ఖాన్.. బెంగళూరులోని ఫైనాన్షియర్ సూర్య అర్జున్ కూడా ఇందులో భాగస్వాములుగా గుర్తించారు. ఇంతకూ వీరు చేసిన మోసాల్ని చూస్తే.. ఇలా కూడా మోసం చేయొచ్చా? అన్న రీతిలో వీరి ప్లానింగ్ ఉండటం విశేషం.

ఈ సంస్థ గడిచిన ఐదేళ్లలో మొత్తం 20 కార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే.. ఈ కార్లకు సంబంధించిన చెల్లించాల్సిన పన్నుల్ని తెలివిగా ఎగ్గొట్టటం ఈ కంపెనీ ప్రత్యేకత. దౌత్య అధికారుల పేర్లతో కార్లను దిగుమతి చేసుకోవటం ద్వారా ఘరానా మోసానికి తెర తీశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లలో రేంజ్ రోవర్.. ల్యాండ్ క్రూజర్..లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

అసలీ మోసం ఎలా జరిగిందన్న విషయాన్ని అధికారులు అనుకోకుండా గుర్తించినట్లు చెప్పాలి. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశానికి చెందిన దౌత్యవేత్త పేరుతో విలాసవంతమైన కార్లను దిగుమతి చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో అలెర్టు అయ్యారు. లోతుగా దర్యాప్తు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తాము చేసే ఆపరేషన్ కు మాంటే కార్లో పేరును పెట్టుకొని విచారణను వేగవంతం చేశారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో తనిఖీలు నిర్వహించి.. దౌత్యవేత్తల పేరు మీద విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆరు కార్లను గుర్తించి రికవరీ చేశారు.

ఈ కార్లను జపాన్.. యూకే.. యూఏఈ దేశాల్లో కొనుగోలు చేశారు. దౌత్యవేత్తల పేర్లతో దిగుమతి చేసినట్లు గుర్తించారు. దేశంలోకి వాహనాలు వచ్చిన వెంటనే వాటిని అయితే ప్రైవేటు వ్యక్తుల వద్దకు కానీ.. లేదంటే విలాసవంతమైన కార్లను అమ్మే వారి వద్దకు చేరుకుంటున్నట్లు గుర్తించారు. ఈ కార్లపై 204 శాతం కస్టమ్స్ డ్యూటీని దౌత్యవేత్తల పేరుతో మినహయింపు పొందటం.. వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మటం ద్వారా భారీగా లాభాల్ని పోగేసుకున్నట్లుగా గుర్తించారు.

ఈ కార్లను మహారాష్ట్ర.. హిమాచల్ ప్రదేశ్.. పంజాబ్ లో రిజిస్ట్రేషన్లు చేయించినట్లు గుర్తించారు. ఈ ఉదంతంపై మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. ఈ స్కాంలో భాగస్వామిగా దుబాయ్ కు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నట్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే.. మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.