Begin typing your search above and press return to search.

మూడు కీలక ఉత్తర్వులపై సంతకం చేసిన బైడెన్.. మనకేంటి లింకు?

By:  Tupaki Desk   |   4 Feb 2021 10:00 PM IST
మూడు కీలక ఉత్తర్వులపై సంతకం చేసిన బైడెన్.. మనకేంటి లింకు?
X
ట్రంప్ సర్కారు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు.. జారీ చేసిన ఉత్తర్వుల్ని సరిచేసే ప్రక్రియలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఆయన మూడు కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. దీంతో.. దేశ వలస విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లైంది. ట్రంప్ హయాంలో అమలైన కఠిన వలస విధానాలకు తాజా ఉత్తర్వులతో చెల్లుచీటి పడినట్లైంది.

డాలర్ డ్రీమ్స్ కలలు తీరేలా.. ముస్లింలపై నిషేధం ఎత్తివేసి దేశ సరిహద్దుల్లో సరైన పద్దతిలో పర్యవేక్షణ జరిగేలా కొత్త వలస విధానం ఉండనుంది. వచ్చే 180 రోజుల్లో ప్రభుత్వ సంస్థలు చేసే సిఫార్సులతో జరిగే మార్పులతో అమెరికా పౌరసత్వం కావాలనుకునే భారతీయుల కలలు నెరవేరే అవకాశం తాజా ఉత్తర్వులతో సాధ్యం కానుంది. తాజాగా బైడెన్ సంతకం చేసిన మూడు కీలక ఉత్తర్వుల్లో ఏముందన్న విషయంలోకి వెళితే..

1. వలస కుటుంబాలు తిరిగి కలవటానికి వీలు కలిగించే ఉత్తర్వుపై జో బైడెన్ సంతకం చేశారు. విడిపోయిన తల్లిదండ్రుల్ని.. పిల్లల్ని కలిపే కార్యక్రమాన్ని హోం ల్యాండ్ సెక్యూరిటీ మంత్రి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తారు. ట్రంప్ అనుసరించిన విధానంతో అమెరికా.. మెక్సికో సరిహద్దుల్లో దాదాపు 5500 కుటుంబాలు విడిపోయాయి. వారందరికి ఊరట కలగనుంది.

2. అమెరికాకు వలసలు పోటెత్తటానికి గల కారణాలు తెలుసుకొని.. వాటిని నివారించటం.. మానవతా దృక్ఫథంతో శరణార్థుల్ని అక్కున చేర్చుకునేలా వ్యూహాన్ని రచించటమే లక్ష్యంగా రెండో ఉత్తర్వు సారాంశంగా చెప్పాలి.

3. స్వేచ్ఛాయుత చట్టబద్ధమైన వలస విధానానికి సంబంధించినది. దేశంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవటానికి వీలు కల్పించే గ్రీన్ కార్డు రాకుండా అడ్డుకునే పబ్లిక్ చార్జ్ నిబంధనల్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది. విదేశాల్లో పుట్టి అమెరికాలో ఉంటున్న వారు దాదాపు 40 లక్షలకు పైనే ఉన్నారు. ఇలాంటి వారిలో భారతీయులే అధికం. ఈ కొత్త అమెరికన్లు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా ఉంటారని భావిస్తున్న బైడెన్.. వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఇందుకు తగ్గట్లే మూడో ఉత్తర్వుపై బైడెన్ సంతకం చేశారు.