Begin typing your search above and press return to search.

అమెరికాపై బైడెన్ ముద్ర‌..తొలి రోజు నుంచే సంచ‌ల‌న నిర్ణ‌యాలు

By:  Tupaki Desk   |   19 Jan 2021 6:47 PM IST
అమెరికాపై బైడెన్ ముద్ర‌..తొలి రోజు నుంచే సంచ‌ల‌న నిర్ణ‌యాలు
X
అమెరికాలోని స‌గానికిపైగా ప్ర‌జ‌లు, ప్ర‌పంచ వ్యాప్తంగా స‌గానికి పైగా దేశాలు ఊహించిందే జ‌రుగుతోంది. అమెరికా అధ్య‌క్షుడుగా బైడెన్ కొలువుదీరిన వెంట‌నే సంచ‌ల‌న నిర్ణ‌యాలు రావ‌డం ఖాయ‌మ‌ని భావించారు. ముఖ్యంగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌ను బైడెన్ ప‌క్క‌న పెడ‌తార‌ని కూడా అనుకున్నారు. వీరు అనుకున్న‌ట్టుగానే బైడెన్ నిర్ణ‌యాలు ఉన్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం.. వైట్ హౌస్ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. అగ్ర‌రాజ్యం ప్ర‌తిష్ట‌ను అతఃపాతాళానికి తొక్కేసిన వీసాల విష‌యంలో బైడెన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలిసింది.

ఈ నెల 20న అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న బైడెన్ ఇప్ప‌టికే త‌న‌దైన నిర్ణ‌యాల‌తో దూసుకుపోతున్నారు. త‌న కార్యాల‌యంలో 20 మంది భార‌తీయ అమెరిక‌న్ల‌కు పోస్టులు క‌ల్పించారు. ఇది గ‌తంలో ఎవ‌రూ చేయ‌ని ఓ సాహ‌సోపేత నిర్ణ‌యం. ఇక‌, ఇప్పుడు ట్రంప్ వివాదాస్ప‌ద నిర్ణ‌యాల్లో కీల‌క‌మైన వీసా విధానాన్ని ప్ర‌క్షాళ‌న చేసేందుకు బైడెన్‌దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు వైట్ హౌస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంతో బైడెన్ ప్ర‌వేశ పెట్ట‌నున్న తొలి బిల్లే.. వీసాకు ఇప్ప‌టి వ‌ర‌కు విదించిన సంకెళ్ల‌ను తెంచేయ‌డం అంటున్నాయి. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీపై తొలి సంత‌కం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

దీనిని బ‌ట్టి వ‌ల‌స‌దారుల వీసాపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారు. వ‌ల‌స‌దారులు ఏదేశానికి చెందిన వారైనా సులువుగా వీసా ల‌భించేందుకు అనువుగా నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఇది తొలి ప్రాధాన్యంగా బైడెన్ భావిస్తున్నారు. ఇది ఆమోదం పొందితే.. సుమారు కోటి ప‌ది ల‌క్ష‌ల మంది పైచిలుకు వ‌ల‌స‌దారుల‌కు ల‌బ్ధి చేకూరనుంది. నిజానికి అనేక దేశాలు గ‌తంలో ట్రంప్ విధించిన ఆంక్ష‌ల‌ను తీవ్రంగా విమ‌ర్శించాయి. అయిన‌ప్ప‌టికీ.. ట్రంప్ త‌న పంతాన్నే నెగ్గించుకున్నారు. ఎన్నిక‌ల్లో దీనిని ప్ర‌ధాన హామీగా పేర్కొన్న బైడెన్ ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌ల మ‌నసుదోచారు. అయితే.. దీనిని వెనువెంట‌నే ఆయ‌న ఆమోదిస్తార‌ని ఎవ‌రూ అనుకోలేదు. ఇక‌, మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం.. దిశ‌గా కూడా బైడెన్ అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ముస్లిందేశాల‌పై గ‌తంలో ట్రంప్ విధించిన ఆంక్ష‌ల‌ను ఎత్తేసేందుకు బైడెన్ వ్యూహాత్మ‌కంగా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. స‌ద‌రు ఆంక్ష‌ల‌ను ఎత్తేయ‌డం ద్వారా.. త‌న‌దైన మార్కుతో ముందుకు సాగాల‌ని బైడెన్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి బైడెన్ ఇంకా ప్ర‌మాణం చేయ‌క‌ముందే.. సంచ‌ల‌న నిర్ణ‌యాల దిశ‌గా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం అమెరికాతోపాటు.. ప్ర‌పంచాన్ని సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుండ‌డం గ‌మ‌నార్హం.