Begin typing your search above and press return to search.

మునుగోడు ఎన్నిక‌ల ముందు కేసీఆర్‌కు షాక్‌.. టీఆర్ఎస్ కీల‌క‌ నేత రాజీనామా!

By:  Tupaki Desk   |   15 Oct 2022 8:30 AM GMT
మునుగోడు ఎన్నిక‌ల ముందు కేసీఆర్‌కు షాక్‌.. టీఆర్ఎస్ కీల‌క‌ నేత రాజీనామా!
X
తెలంగాణ‌లో మునుగోడు ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించి స‌త్తా చాటాల‌ని భావిస్తున్న అధికార‌ టీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు తీవ్ర షాక్ త‌గిలింది. ఆ పార్టీ భువ‌న‌గిరి మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా సీఎంకు కేసీఆర్‌కు ఘాటు లేఖ‌ను సంధించారు. ఆ లేఖ‌లో బూర న‌ర్స‌య్య గౌడ్ సంచ‌ల‌న కామెంట్లు చేశారని తెలుస్తోంది.

2014 ఎన్నిక‌ల్లో బూర నర్స‌య్య గౌడ్ భువ‌న‌గిరి నుంచి టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిపై ఓడిపోయారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు డాక్ట‌ర్స్ సెల్ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్య‌మంలో బూర న‌ర్స‌య్య గౌడ్ కీల‌క‌పాత్ర పోషించారు.

అయితే మునుగోడులో టీఆర్ఎస్ త‌ర‌ఫున అభ్య‌ర్థిని ఖ‌రారు చేసేముందు త‌న‌ను సంప్ర‌దించ‌క‌పోవ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హిస్తున్న ఆత్మ‌గౌర‌వ స‌భ‌ల‌కు త‌న‌ను పిల‌వ‌క‌పోవ‌డంతో బూర న‌ర్స‌య్య గౌడ్ తీవ్ర అసంతృప్తి చెందిన‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి మునుగోడులో బీసీల జ‌నాభా ఎక్కువ‌. అందులోనూ గౌడ సామాజిక‌వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌. దాదాపు 40 వేల నుంచి 50 వేల వ‌ర‌కు గౌడ్ల ఓట్లే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మునుగోడు సీటు త‌న‌కు వ‌స్తుంద‌ని బూర న‌ర్స‌య్య గౌడ్ ఆశించారు.

త‌న‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం, వేరే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేముందు అయినా త‌న‌ను ఒక్క మాట అడ‌గ‌క‌పోవ‌డంతో ఆయ‌న కినుక వ‌హించార‌ని సమాచారం. ఈ నేప‌థ్యంలోనే బూర న‌ర్స‌య్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆయన సీఎం కేసీఆర్‌కు పంపారు. లేఖలో ఆయన ఘాటుగానే తన అసంతృప్తిని వెల్లగక్కినట్లు స‌మాచారం.

''అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. నాకు సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారు. ఆత్మగౌరవ సభలకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు. మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా నాతో సంప్రదింపులు జరపలేదు... సమాచారం ఇవ్వకుండానే మునుగోడు అభ్యర్థిని ప్రకటించారు. నిజయోకవర్గ స్థాయి సభలు, సమావేశాలకు ఆహ్వానించలేదు.

నేను వ్యక్తిగతంగా అవమానపడ్డా. పార్టీకి నా అవసరం లేదని భావిస్తున్నా. నాకు అవమానం జరుగుతుందని తెలిసి కూడా కేసీఆర్‌ పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో నా ఓటమి వెనుక అంతర్గత కుట్ర ఉంది.

కేసీఆర్‌ను కలవాలంటే ఇప్పుడు తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి... రాజకీయ వెట్టి చాకిరిని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు. బీసీలకు టికెట్‌ పరిశీలించమని అడగడం కూడా నేరమేనా? హైదరాబాద్‌లో ఆరడుగుల జయశంకర్‌ విగ్రహం పెట్టలేదు’’ అని తన రాజీనామా లేఖలో బూర నర్సయ్య గౌడ్‌ పేర్కొన్నట్లు చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.